- కొత్తగూడెం.. మారుతున్న చిత్రం
- వనమాపై అనర్హత.. జలగం వెంకట్రావుకు లైన్ క్లియర్
- హైకోర్ట్ తీర్పుతో సందిగ్ధంలో బీఆర్‌ఎస్ అధిష్టానం
- ఇద్దరూ బీఆర్‌ఎస్ నేతలే!
- గడల ఆశలు గల్లంతు అనే వార్తలు
హైదరాబాద్: రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో.. రాజకీయంగా చర్చనీయాంశం నిలుస్తున్న నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక నియోజకవర్గంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం విషయంలో.. సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఎన్నికల చెల్లదని, రివిజన్‌కు కూడా ఆస్కారం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారు అనే చర్చ సాగుతోంది.
ఇద్దరూ.. బీఆర్‌ఎస్ నేతలే
కొత్తగూడెం నియోజకవర్గంలో కనిపిస్తున్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే.. సిటింగ్ ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయనపై వ్యతిరేకంగా న్యాయ పోరాటం సాగించి విజయం సాధించిన జలంగా వెంకట్రావు ఇద్దరూ అధికార బీఆర్‌ఎస్ నేతలే కావడం. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 4,139 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత వనమా.. కాంగ్రెస్ పార్టీ వీడి కారు పార్టీలో చేరారు. దీంతో.. అప్పటి నుంచి ఆయన బీఆర్‌ఎస్ నాయకుడిగా, ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. మరోవైపు వనమా కంటే ముందుగానే వెంకట్రావు బీఆర్‌ఎస్ నాయకుడిగా నియోజకవర్గంలో అధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికలకు ఇద్దరూ ఆశావాహులుగానే అడుగులు వేస్తున్నారు. కానీ హైకోర్ట్ తీర్పుతో పరిస్థితి మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వనమాపై అనర్హత వేటు కూడా
హైకోర్టు తాజా తీర్పును పరిశీలిస్తే.. వనమాపై అనర్హత వేటు కూడా పడింది. అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వడం కష్టమే అని.. జలగంకు లైన్ క్లియర్ అయినట్లే అయి జలగం వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. జలగం బీఆర్‌ఎస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరని.. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండరనే వ్యతిరేకత ముద్ర జలగంపై పడింది. ముఖ్యంగా ఓటమి పాలయ్యాక.. పార్టీకి అంటీముంటనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. వనమాపై అనర్హత వేటు పడినా.. జలగంకు టికెట్ ఖరారు చేసే విషయంలో అధిష్టానం తొందరపాటుగా వ్యవహరించదని, ఆచితూచి అడుగులు వేస్తుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
తెరపైకి గాయత్రి రవి పేరు
తాజా పరిణామాల నేపథ్యంలో.. కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్తగా రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి పేరు తెరపైకి వస్తోంది. గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తూ.. గాయత్రి రవిగా గుర్తింపు పొందిన రవిచంద్రకు బీఆర్‌ఎస్ అధినేత ఆశీసులు మెండుగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారనే వార్త కూడా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసిన ఓడిన గాయత్రి రవి.. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి అధినేతకు నమ్మకంగా వ్యవహరిస్తుండడంతో గత ఏడాది ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్ధికంగా, సామాజికంగా బలమైన వ్యక్తిగా ఉన్న గాయత్రి రవికి కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలోనూ బీఆర్‌ఎస్ అధినేత సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
పొంగులేటి కూడా కొత్తగూడెం నుంచేనా?
మరోవైపు.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. పాలేరు కంటే.. కొత్తగూడెం నుంచి గెలిస్తే.. మరింత సులువుగా గెలవొచ్చనే అభిప్రాయం.. ఇప్పటికే నియోజకవర్గంలో వనమా అంటే వ్యతిరేకత నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. పొంగులేటి కొత్తగూడెం నుంచి పోటీకి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సెంటర్ పాయింట్‌గా ఉన్న కొత్తగూడెంలో నిలబడితే ఇతర నియోజకవర్గాల నేతలతోనూ సమన్వయం చేసుకోవచ్చనే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్ అధిష్టానం.. పొంగులేటికి దీటైన పోటీ ఇచ్చేలా గాయత్రి రవికి టికెట్ ఇచ్చే దిశగా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
గడల ఆశలు.. గల్లంతు
ఇదిలా ఉంటే.. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు, నేతలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్న విషయం.. గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వం. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఎన్నోసార్లు ఆయన అధికార పరిధి దాటి బీఆర్‌ఎస్ భజన చేయడం, నేతల సేవలో తరిస్తుండడం తెలిసిందే. అంతేకాకుండా.. వనమా కుమారుడు రాఘవ ఎపిసోడ్‌తో వనమాకు జరిగిన డ్యామేజ్‌ను తనకు అనుకూలంగా మలచుకుని.. వనమాపై పరోక్ష విమర్శలు చేస్తూ వస్తున్న గడల శ్రీనివాసరావుకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంతగా ట్రస్ట్ నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గడలకు.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి ఇచ్చినా సంకటమే
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం టికెట్ ఎవరికి ఇచ్చినా పరిస్థితులు సంకటంగా మారే సూచనలున్నాయని బీఆర్‌ఎస్ అధిష్టానం భాబిస్తున్నట్లు తెలుస్తోంది. జలగంకు ఇస్తే వనమా వర్గీయులు వ్యతిరేకంగా కదులుతారనే సంకేతాలు అందుకున్నట్లు సమాచారం. దీంతో మధ్యే మార్గంగా గాయత్రి రవి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మున్నూరు కాపు ఓట్లు బలంగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన నేతకు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం మదిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే.. కొత్తగూడెం నియోజకవర్గం విషయంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు నేతల విషయంలో ప్రతికూలత నెలకొనడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరోవైపు.. గత ఎన్నికల్లో గెలిచిన వనమా తమ పార్టీ గుర్తుపైనే గెలిచిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దాని ద్వారా తమ బలం మరోసారి నిరూపించుకోవాలనే యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ.. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నేతలు పారదర్శకంగా వ్యవహరించాలని లేదంటే.. తాత్కాలిక ప్రయోజనం కలిగినా దీర్ఘకాలంలో అది కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని వనమా ఎపిసోడ్‌పై రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.