Monday, March 24, 2025

 కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరు…

- Advertisement -

 కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరు…
హైదరాబాద్, మార్చి 7, (వాయిస్ టుడే )

Who is responsible for the defeat of Congress?

రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీని తోసిరాజని రెండింటిని బీజేపి తన్నుకుపోయింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్  ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడిందనే చెప్పాలి.  అధికార పార్టీ హోదాలో కాంగ్రెస్   ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలవకపోవడం  రేవంత్ సర్కార్ కు పెద్ద దెబ్బగా కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగినా అనుకున్న ఫలితాలు రాలేదు. సిట్టింగ్ స్థానం కోల్పోవడమే కాకుండా  అది తమ బద్ద శత్రువైన బీజేపీ ఖాతాలో పడటం హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 15 నెలల అధికారంలో  తాము అన్ని  హమీలు నెరవెర్చుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రచారం చేసినా పట్టభద్రుల నియోజకవర్గ  ఎమ్మెల్సీ స్థానాన్ని  కాంగ్రెస్ కోల్పోయింది.  బీసీ నినాదంతో కాంగ్రెస్ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినా అది బూమ్ రాంగ్ అయింది.  ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టును నిలుపుకున్న వైనానికి  ఈ ఫలితాలు సాక్ష్యంగా ఉన్నాయి.  ఉమ్మడి కరీంగనర్ – నిజామాబాద్-  ఆదిలాబాద్- మెదక్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి  అంజి రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి  నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  హోరా హోరీ  ఇద్దరి మధ్య విజయం దోబూచులాడినా, రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపుతో బీజేపి ముందుకు పోగా, కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా బీజేపీ బలపర్చిన  కొమరయ్య గెలుపొందారు.  ఇలా ఉత్తర తెలంగాణలో కీలకమైన రెండు స్థానాలను బీజేపీ గెల్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ ఎన్నికల్లో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఇక బీఆర్ఎస్ ఈ ఎన్నికల బరి నుండి తప్పుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా పని చేశాయి.  కరీంనగర్ – నిజామాబాద్- ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ  నియోజకవర్గంలో 15 జిల్లాలు,  42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే అక్కడి పట్టభద్రుల తీర్పుగా ఈ ఎన్నికల ఫలితాన్ని చూడాల్సి ఉంది.  అంతే కాకుండా ఇది నేరుగా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్- బీజేపీలు పోటీ పడుతున్నాయి. తమకు బలం లేని చోట మిత్రపక్షాల కూటములతో పోటీ పడుతున్నాయి. అయితే  ఇక్కడి ఎన్నికల్లో రెండు పార్టీలు నేరుగా పోటీ పడటంతో  అటు కాంగ్రెస్ సర్కార్ , ఇటు బీజేపీ రెండు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. బీజేపీ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ , బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా  ఈ ఎన్నికలను తీసుకుని పని చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, అధికార పార్టీఎమ్మెల్యేలు అదే రీతిలో ప్రచారం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకోవడంతో బీజేపీలో జోష్ పెరిగింది. గత   అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ట్రాయంగిల్ పోటీని ఎదుర్కొన్న  కాషాయం పార్టీ  8 అసెంబ్లీ స్థానాలను, 8 ఎంపీ స్థానాలను  గెల్చుకుంది.  ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీతో జరిగిన  ఎమ్మెల్సీ పోరులో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను  రెండు బీజేపీ ఖాతాలో పడ్డాయి.   దీంతో రాష్ట్రంలోని చట్ట సభల్లో కాషాయ పార్టీకి  పది మంది సంఖ్యా బలం అంటే రెండు అంకెల స్కోరు కు చేరడం విశేషం.  ఓవరాల్ గా 8 మంది ఎమ్మెల్యేలు,   ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఆరుగురు ఎంపీలు,   ఒక రాజ్య  సభ సభ్యుడు , తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీల బలం బీజేపీది.   ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో  కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో తన బలాన్ని సుస్థిరం చేసుకుందనే చెప్పాలి.  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల నాధులు ఇప్పటి నుండే  కసరత్తు ప్రారంభించారు.  ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగలేదు.  పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానం గెలవలేకపోయింది.  బీఆర్ఎస్ కు తమ విజయాలతో చెక్ పెట్టడం ద్వారా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెప్పుకునే పరిస్థితి  కల్పించారు. స్థానిక సంస్థల్లోను కమలంను వికసింపజేస్తే ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అధికార పీఠమేనని పార్టీ నేతలు చెబుతున్నారు.  ఆ దిశగా ఇప్పటికే కేంద్రంలోని ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు  వ్యూహాలు రచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారధి  నియమితుడవుతాడని కమలం సీనియర్లు చెబుతున్నారు. ఈ విజయం ఇచ్చిన జోష్ తో  రానున్న రోజుల్లో బీజేపీ అధికార పీఠం దక్కించుకునే దిశగా సాగుతుందని చెప్పక తప్పదు.ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  బీసీ కుల గణన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం కూడా పార్టీకి నష్టం చేకూర్చింది.  అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఇందుకు  కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కొంత నష్టం చేశాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.  ఉత్తర తెలంగాణలోని 19 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు , కాని రిజల్ట్ భిన్నంగా రావడంతో ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో వ్యూహ, సమన్వయ లోపం జరిగిందన్న చర్చ హస్తం నేతల్లో సాగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్