కరీంనగర్, నవంబర్ 2, (వాయిస్ టుడే ): అమిత్‌షా బీసీ సిఎం ప్రకటనతో తెలంగాణ బీజేపీలో సిఎం అభ్యర‌్ధి ఎవరనే కొత్త చర్చ మొదలైంది. బీజేపీ గెలిస్తే బండి సిఎం అవుతాడా….ఈటల అవుతారా అనే చర్చ మొదలైంది. సూర్యాపేటలో జరిగిన బహిరంగసభలో అమిత్ షా చేసిన ప్రకటనతో తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్త చర్చ ప్రారంభమైంది.బీసీలకు పెద్దపీట వేస్తు అభ్యర్థిత్వాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్,ఈటెల రాజేందర్ పేర్లు ముఖ్యమంత్రులనే చర్చ మొదలైంది.రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకే సీఎం పదవిని ఇస్తామని చెప్పిన కేంద్ర హోం శాఖమంత్రి,బీజీపే అగ్రనేత అమిత్ షా చేసిన ప్రకటన.. బీజేపీ బీసీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది..ఈ ప్రకటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్యనేతలైన ఈటల రాజేందర్,బండి సంజయ్ లకు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారాల్లో పెద్దపీట వేయడం ఇందుకు బలం చేకూరుతోంది.తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ దూకుడు పెంచుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు రెండు మూడు సభలకు హజరు కావడం.. కాంగ్రేస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ,మల్లిఖార్జున్ ఖర్గే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు ఇప్పటికే చాలాచోట్ల సభల్లో పాల్గొనడంతో ఇతర పార్టీల దూకుడుకు ధీటుగా బీజేపీ పార్టీ దూకుడు పెంచుతోంది.ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సేవలను పూర్తి స్థాయి వినియోగించుకోవడానికి బీజేపీ పార్టీ ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్ కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రతిచోట సమస్యలు తెలుసుకున్న నాయకుడికి హెలికాప్టర్ కేటాయించడం ద్వారా రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటించడానికి అనుకూలంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.దీంతో బండి సంజయ్ కి ఉన్న ప్రజాదరణను పూర్తి స్థాయి వినియోగించుకున్నట్టు ఉంటుందని ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది…అయితే బండికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కాబోయే సీఎం బండి సంజయ్ అంటు ప్రతిచోట కార్యకర్తలు నినాదాలు చేయడంతో అమిత్ షా మాటలకు బలం చేకూరినట్టు అవుతోంది.తెలంగాణా సాధనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈటల అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో పాటు కేసీఆర్ వ్యూహలను పసిగట్టి … ఆయన దూకుడును తగ్గించే నాయకుడని, ఈటలకు బీజేపీ పార్టీలో చేరినరోజునుండి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరెవరికి సీట్లు ఇస్తే బీజేపీకి మెజార్టీ వస్తుందనే అంచనాలన్ని ఈటెల వ్యూహమనే చెప్పవచ్చు. సీట్ల కేటాయింపు నుండి మొదలుకుని ఇతర పార్టీలనుండి వచ్చే నాయకులను చేర్చుకోవడం దాకా పూర్తి స్థాయి భాధ్యతలను ఈటలకు అప్పగించారు.
భారతీయ జనతా పార్టీ తొలి ఎన్నికల సభ ఈటల స్వంత నియోజకవర్గమైన హుజురాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం,ప్రథానమంత్రి నరేంద్రమోడీ,అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ లాంటి అధినాయకులు నేరుగా ఈటలతో మాట్లాడుతుండడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటెల బరిలో ఉంటాడని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటెల ప్రసంగంలో,తాను ఒక్కడిని గెలిస్తే సీఎం ను కానని,తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచినప్పుడు మాత్రమే తాను సీఎంను అవుతానన్న వీడియో బీజేపీ నాయకుల వాట్సప్ ల్లో చక్కెర్లు కొడుతోంది…బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి గా కేసీఆర్ అవుతారని,కాంగ్రేస్ పార్టీకి ఓట్లు వేస్తే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని,బీజేపీ పార్టీకి ఓటు వేస్తే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన అమిత్ షా మాటలు బీసీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. అగ్రవర్ణాల ఆధిపత్యానికి ముగింపు పలుకుదామనే నినాదంతో ముందుకు వస్తున్న బీజేపీ నాయకుల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.