ట్యాపింగ్ తో 40 మంది మహిళలను వేధించిన ఘరానా కానిస్టేబుల్ ఎవరు?
తెలుగు రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తెలంగాణను కుదిపేస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపిస్తున్న ఈ అంశంలో అప్పటి ప్రభుత్వ పెద్దలను వేలెత్తి చూపుతోంది ప్రస్తుత ప్రభుత్వం. అయితే, ట్యాపింగ్ ను అప్పటి సర్కారు ప్రతిపక్ష నేతల కదలికలను పసిగట్టేందుకు వాడుకోగా.. ఇదే అదనుగా ఓ కానిస్టేబుల్ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. ఏకంగా మహిళల ఫోన్లను ట్యాప్ చేసి వేధించాడు.
ఎవరు అతడు..?
హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు ఆ ఘరానా కానిస్టేబుల్ ను విచారించగా.. దిమ్మతిరిగే అంశాలు వెలుగుచూశాయి. ఈ కానిస్టేబుల్ నల్లగొండ జిల్లావాడు. పోలీస్ దురుసుతనం చూపించే ఇతడిని అప్పటి జిల్లా బాస్ ట్యాపింగ్ కోసం ఏరికోరి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అసలే దూకుడు స్వభావి. ఇక ట్యాపింగ్ వంటి ఆయుధం చేతికిచ్చారు. దీంతో అతడు చెలరేగిపోయాడు. జిల్లాలోని రైస్ మిల్లర్లు, పేకాట నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేశాడు. రూ.కోట్లు దండుకున్నాడు.
పోలీస్ బాస్ కు చాలా ఇష్టుడు
ఘరానా కానిస్టేబుల్ ను పోలీస్ బాస్ బాగా దగ్గరకు తీశారు. అతడు ఎంత చెబితే అంత అన్నట్లు చేశారు. ఇక నల్లగొండలోని హైదరాబాద్ రోడ్ లో ఏర్పాటు చేసిన ట్యాపింగ్ సెంటర్ నుంచి ఈ కానిస్టేబుల్ ఆగడాలకు పాల్పడ్డాడని సమాచారం. మొత్తం 40 మంది మహిళల ఫోన్ నంబర్లు సేకరించి ట్యాపింగ్ ద్వారా వారి వ్యక్తిగత సంభాషణలను విన్నాడు. వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. పలువురిని లైంగికంగా వేధించినట్లు సమాచారం. ఈ బాధితులంతా ఇప్పుడు బయటకు వచ్చి వివరాలు వెల్లడించేందుకు సిద్ధం అవుతున్నారు.
9 ఎకరాలను సెటిల్ చేశాడు
కానిస్టేబుల్ వంటి చిన్న ఉద్యోగంలో ఉన్న అతడు సెటిల్ మెంట్లలో మాత్రం పెద్ద పాత్రే షోషించాడని విచారణలో తేలింది. మాజీ పోలీస్ బాస్ బినామీలకు సంబంధించి 9 ఎకరాల భూమిని సెటిల్ మెంట్ చేసినట్లు స్పష్టమైంది. అయితే, వీటన్నికంటే 40 మంది మహిళలను వేధించడమే పెద్ద నేరంగా బయటకు రానుంది. మరో విషయం ఏమంటే.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలోనూ ఈ కానిస్టేబుల్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేసులో కానిస్టేబుల్ ను గట్టిగా ప్రశ్నించే వీలుంది.
ఇలా చేరాడు..
బెదిరింపులు, దందాలు, సెటిల్ మెంట్లలో ఘరానా కానిస్టేబుల్ ది అందెవేసిన చేయి. ఇతడిని ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన అధికారి బాగా చేరదీశారని విచారణలో తేలింది. అయితే, ఈ ఉన్నతాధికారి ఆ జిల్లాలో పనిచేశారు. ఆ అధికారి తర్వాత వచ్చిన అధికారి.. కానిస్టేబుల్ ను బాగా ప్రోత్సహించారు. ఆ మార్గంలోనే ఈ కానిస్టేబుల్ ట్యాపింగ్ టీమ్ లో చేరాడు.



