ఇంపాల్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): ఈశాన్య రాష్ట్రమైన మిజోరం అసెంబ్లీకి వచ్చే నెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. ఈ ఏడాది పొరుగున్న ఉన్న మరో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో చోటు చేసుకున్న వరుస ఘటనల ప్రభావం మిజోరంపై కనిపిస్తోంది. ముఖ్యంగా క్రైస్తవుల్లో బీజేపీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మణిపూర్ లో హిందువులైన మెయిటీలను వెనకేసుకొచ్చి క్రైస్తవ కుకీలపై దాడులకు కారణమయ్యారనే అపప్రదను బీజేపీ మూటగట్టుకుంది.మిజోరంలోని 8 జిల్లాల్లోనూ క్రైస్తవులే మెజారిటీ జనాభాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవుల ఓట్లు లేకుండా ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం లేదు. అలాంటి పరిస్ధితుల్లో బీజేపీ మద్దతుతో సీఎంగా ఉన్న ఎంఎన్ఎఫ్ నేత జోరామ్ తంగాకు ఈసారి పరిస్ధితులు ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా మణిపూర్ ఘటనల తర్వాత బీజేపీకి దూరంగా జరుగుతూ, కుకీలకు మద్దతుగా తమ ఎంపీలతో పార్లమెంటులో సైతం ఓటు వేయించిన ఆయన.. మరోసారి తమను ఆదరించాలని కోరుతున్నారు.కానీ మిజోరం చరిత్ర చూసుకుంటే 1989 నుంచి ఇప్పటివరకూ అధికారం కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ మధ్య చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మణిపూర్ ఘటనల్ని రాహుల్ గాంధీ పార్లమెంటులో హైలెట్ చేయడం, అవిశ్వాస తీర్మానం పెట్టించడం, అలాగే తాజాగా మణిపూర్ కంటే ఇజ్రాయెల్ ముఖ్యమైపోయిందంటూ కేంద్రంపై విమర్శలు చేయడం ఇందులో భాగమే.నెలలో ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో మిగతా నాలుగు రాష్ట్రాల్లో పరిస్దితులు తమకు అనుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో మిజోరంను కూడా ఆ జాబితాలో చేర్చాలని రాహులు పట్టుదలగా ఉన్నారు. అందుకే తాజాగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో పూర్తిస్దాయిలో పర్యటించారు. అయితే ప్రస్తుతం 80 ఏళ్ల వృద్ధుడైన కాంగ్రెస్ మాజీ సీఎం లాల్ తన్హావాలా.. మరోసారి లీడ్ చేసే పరిస్ధితి లేదు. ఆయన స్ధానంలో పీసీసీ అధ్యక్షుడైన లాల్ స్వాతా ఐకానిక్ నేత కాకపోవడం, స్ధానిక సంప్రదాయాలపై పూర్తిగా అవగాహన లేకపోవడం మైనస్ అవుతోంది. అయినా అధికార ఎంఎన్ఎఫ్ కూటమి, మరో పార్టీ జోరాం పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎం)లతో పోటీ పడి అత్యధిక స్ధానాలు గెల్చుకుంటామనే ధీమాలో ఉంది.