ఎవరికి ఎర్త్… ఎవరికి బెర్త్…
హైదరాబాద్, మార్చి 26, (వాయిస్ టుడే)
Whose land... Whose berth...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఉగాది సందర్భంగా ఈ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నేతలు హాజరైన ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగాయి. పార్టీ అధిష్ఠానం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపైనా అధిష్ఠానం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.కొత్త మంత్రివర్గంలో రెండు బీసీ, ఒక రెడ్డి, ఒక ముస్లిం, ఒక ఎస్సీ సామాజిక వర్గాలకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తుండగా, ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పేరు ప్రముఖంగా ఉంది. రెడ్డి కోటాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్‌కు అవకాశం ఉండగా, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు కూడా చర్చలో ఉంది.అయితే, ప్రస్తుత మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. వరుస వివాదాల్లో చిక్కుకున్న కొండా సురేఖ పదవి కోల్పోతారనే చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతోంది. కొత్త మంత్రివర్గ జాబితా మరో రెండు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. ఈ విస్తరణతో రేవంత్ రెడ్డి టీమ్‌లో కొత్త ఊపు వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.
నలుగురికి అవకాశం
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక చొరవ చూపుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో క్యాబినెట్‌లో నలుగురు కొత్త మంత్రులను చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం ఉందని తెలుస్తోంది.కొత్తగా మంత్రులుగా చేరనున్న వారిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి. వివేక్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురూ విభిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలకు ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ విధానాన్ని ప్రతిబింబిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడిగా, పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. జి. వివేక్, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతగా, పార్టీకి కొత్త ఊపు తెచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాంతీయ సమతుల్యతను సాధించేందుకు ఎంపికయ్యారు.ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో 12 మంది మంత్రులు ఉండగా, గరిష్టంగా 18 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఈ విస్తరణతో ఆరు ఖాళీల్లో నాలుగు భర్తీ కానున్నాయి. ఈ చర్చల్లో ప్రాంతీయ, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, గత ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విస్తరణతో పార్టీలో అసంతృప్తిని తగ్గించి, ప్రభుత్వ పనితీరును మరింత బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించనుంది. కొత్త మంత్రుల ఎంపికతో ప్రభుత్వంలో సమతుల్యత, సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించనున్నాయి.