పశ్చిమాసియాలో యుద్ధం ఎవరిది? ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆపాలి?
న్యూ డిల్లీ మార్చ్ 14
Whose war is it in West Asia? Who started it? Who must stop it?
;పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని, తాము విజయపథంలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విస్తృతంగా ప్రకటనలు గుప్పిస్తుండగా, మరోవైపు ఇరాన్ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారు? అలాగే ఈ యుద్ధం ఎవరిది? ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆపాలి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యుద్ధంలో తాము జయించాం. కానీ తగినంత కాదు అని ట్రంప్ ప్రకటిస్తున్నారు. కాగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో జరుగుతున్న యుద్ధం ఆగాలంటే ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్ దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. అమెరికా కూటమితో ఎటువంటి ఒప్పందం జరిగినా.. ఇరాన్ సహజ హక్కులను గుర్తించాలని పెజెష్కియాన్ అన్నారు. రష్యా, పాకిస్థాన్ నేతలతో ఈ అంశం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలంటే కొన్ని అంశాలు కీలకమైనవని ఆయన అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ముగియాలంటే మూడు అంశాలు ముఖ్యమైనవని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్ హక్కుల్ని గుర్తించడం, నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయబోమనన్న గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ కష్టాలు, నష్టాలు, అరిష్టాలు చివరికి ప్రపంచం మొత్తం భరించవలసి వస్తోంది. ఈ యుద్ధోన్మాదం ఎందుకో సరైన కారణం లేదు. యుద్ధం ముగిసిన తరువాత ఏమవుతోందో తెలీదు. అయినా రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక పరిస్థితి రానురానూ అధ్వానంగా దిగజారిపోతోంది. ఇరాన్‌పై యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే 5.6 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.51 వేల కోట్లు) విలువైన ఆయుధ సామగ్రిని అమెరికా వినియోగించింది. అంటే అమెరికా ఎంత నష్టపోతోందో తెలుస్తోంది. దీనికి తోడు అనూహ్య సంక్లిష్ట రాజకీయ పరిణామాలకు ట్రంప్ గంగవెర్రులెత్తుతున్నారు. యుద్ధాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని కొందరు సహాయకులు సలహా ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ మిత్రదేశం ఇరాన్‌పై దూకుడు తగదని, అలాగే కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని టార్గెట్ చేయడం మంచిది కాదని ట్రంప్‌ను హెచ్చరించడమే కాక, ఇరాన్‌కు అండగా ఉంటున్నారు. ఇదే విధంగా చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తోంది. తాజాగా ఉత్తరకొరియా ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. ఇవన్నీ పరిశీలిస్తే ట్రంప్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయనే చెప్పాలి. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడుల్లో అరబ్‌దేశాలు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇరాన్ కేవలం అమెరికా మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్షంగా పెట్టుకోవడం లేదు. పౌరనివాసాల పైనా, మార్కెట్లపైనా, దాడులతో ధ్వంసం సాగిస్తోంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో అరబ్ దేశాలు ఊగిసలాడుతున్నాయి. చమురు క్షేత్రాలు, డీశాలినేషన్ ప్లాంట్లపై మంటలు చెలరేగుతుంటే అవి మీడియాలో వైరల్ దృశ్యాలుగా కనిపిస్తుంటే ప్రజల హాహా కారాలు తప్ప ఎవరూ దాడులను ఆపలేకపోతున్నారు. హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్న చమురు ట్యాంకర్లకు ఎస్కార్ట్ కల్పిస్తున్నట్టు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ సోషల్ మీడియాలో మొదట ప్రచారం చేసినా తరువాత విరమించుకున్నారు. అమెరికా ఎలాంటి ఎస్కార్ట్ చేయలేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అంటే హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని, అలా అడ్డుకుంటే ఇరాన్ ధ్వంసం అవుతుందని ట్రంప్ హెచ్చరికలు కేవలం బీరాలుగానే మిగిలాయి. ఏ చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు హార్ముజ్ మీదుగా తీసుకెళ్లలేదని ఇరాన్ ఐఆర్‌జిపి వెల్లడించింది. పైగా హార్ముజ్ జలసంధిలో అమెరికా మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఉచ్చులు పరిచింది. దీనికోసం సీమైన్స్ లేదా నేవల్ మైన్స్ (మందుపాతరలు) అమర్చుతోంది. ఇరాన్ వద్ద దాదాపు 2000 నుంచి 6000 వరకు సీమైన్స్ ఉన్నట్టు అంచనా. 1980 ప్రాంతంలో ట్యాంకర్ వార్ వేళ ఇరాన్ భారీ సంఖ్యలో సీమైన్స్‌ను వాడి శత్రునౌకలను ధ్వంసం చేసింది. ఈ పరిస్థితుల్లో చమురుపై ఆంక్షలు ఎత్తివేసినట్టు ట్రంప్ ప్రకటించడం ఎంతవరకు లాభం? రష్యా నుంచి ఉత్పత్తి అయిన క్రూడ్ లభ్యమవుతుందని, చమురుకు ఎలాంటి కొరత ఉండదని ట్రంప్ శెలవిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించడానికి తమ వద్ద ఉన్న చమురు నిల్వల్లో కొంతభాగాన్ని మార్చి 16 నాటికి మార్కెట్లోకి తీసుకొస్తామని జపాన్ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా ఒక్కటే కాదు. ఎరువులు కూడా రవాణా అవుతుంటాయి. అందుకే హార్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర రవాణా, అంతర్జాతీయ సరఫరా గొలుసుల పైనా ప్రభావం పడుతుందని, ఎరువుల ధరలతోపాటు రవాణా ఛార్జీలు, బీమా ప్రీమియంలు పెరిగిపోతాయని, ఆహార ధరలు, జీవన వ్యయాలకు రెక్కలొస్తాయని పేదవర్గాల ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మరిన్ని కనుగొనండి క్రీడా పరికరాలుఎరువుల తయారీకి గల్ఫ్ దేశాల నుంచి కావలసిన ఎల్‌ఎన్‌జీ (ద్రవరూప సహజవాయువు) మనదేశం దిగుమతి చేసుకోవడం పరిపాటి. ప్రస్తుతం 70% గ్యాస్ నిల్వలే భారత్ వద్ద ఉన్నాయి. దీంతో యూరియాను ఉత్పత్తి చేసే భారత్‌కు చెందిన ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కొన్నిప్లాంట్లను మూసివేయడమే కాక, మరికొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించింది. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ శాశ్వతంగా మూసివేస్తే ఇరాన్ నాశనమవుతుందని ట్రంప్ హెచ్చరిస్తూ బ్రిటన్ స్థావరాల మీదుగా భారీ బాంబర్లను పంపినా, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గాజా స్ట్రిప్ మాదిరిగా టెహ్రాన్‌ను శిథిలాల కుప్పగా కూల్చినా ఇరాన్ ప్రాథమిక అణుబాంబుల సమస్య మాత్రం సమసిపోదు. పశ్చిమాసియా లేదా ఉత్తరాఫ్రికా రీజియన్‌లో అమెరికా లేదా రష్యా ప్రమేయంతో చెలరేగే యుద్ధాలు అమెరికా, పశ్చిమదేశాల నాయకులను మినహాయించి కొన్ని పాలనా తరాలను మార్చడం తప్ప మరేమీ ప్రయోజనం అందించలేవని చరిత్ర పాఠాలు చెబుతున్నాయి.



