కేటీఆర్‌కు అంత అహంకారం ఎందుకు?

- Advertisement -
Why is KTR so arrogant?
Why is KTR so arrogant?

కేటీఆర్‌కు అంత అహంకారం ఎందుకు?

‘అమెరికాలో అంట్లు తోమిన వాడికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి

సిరిసిల్లను ‘ఉరిసిల్ల’గా మార్చారు.. నేతన్నల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు?

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకొస్తా

వెయ్యి రోజుల పాలనలో నేతన్నల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేశాం

Why is KTR so arrogant?

సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (వాయిస్ టుడే):
సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అయితే గత బీఆర్‌ఎస్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాలతో సిరిసిల్లను ‘ఉరిసిల్ల’గా మార్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చేనేత, పవర్లూమ్‌ కార్మికుల సమస్యలు, గల్ఫ్‌ వలసలు, నేరెళ్ల ఘటన, మిడ్‌మానేరు ముంపు తదితర అంశాలను ప్రస్తావిస్తూ గత పాలనపై విమర్శలు చేశారు.

మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైందని, వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అసలైన చిరునామా అని సీఎం అన్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను తయారు చేసే నైపుణ్యం సిరిసిల్ల నేతన్నల సొంతమని పేర్కొన్నారు. 2009 నుంచి పలుమార్లు సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ గెలిచినప్పటికీ నేతన్నల ఆత్మహత్యలు, గల్ఫ్‌ వలసలు ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు.

కేటీఆర్‌ ఆస్తులపై ఆరోపణలు

కేటీఆర్‌, కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ, అమెరికాలో పనిచేసిన కేటీఆర్‌కు ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించారు.

మానేరు ఇసుక తవ్వకాలు, నేరెళ్ల ఘటన, మిడ్‌మానేరు ముంపు తదితర అంశాలను ప్రస్తావించిన సీఎం.. గత పాలనలో బాధితులకు న్యాయం జరగలేదని విమర్శించారు.

గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక విధానం

గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

నేతన్నల కోసం రూ.1,741 కోట్లు

తమ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశామని, నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను చెల్లించామని, నేతన్నలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తోందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలపై ప్రస్తావన

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, సన్నబియ్యం సరఫరా చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

తమ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.20,614 కోట్లు చెల్లించిందని తెలిపారు. 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి

రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీ అధిష్ఠానాన్ని ఒప్పించి మంత్రివర్గంలోకి తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను పెద్దల సభకు పంపించాలని కోరారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

సిరిసిల్ల పర్యటనలో భాగంగా రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో నేత బజార్‌, సిరిసిల్ల–వేములవాడలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

పెద్దూరులో ఇందిరా మహిళా శక్తి భవనం, వేములవాడ మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిరిసిల్ల–వేములవాడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించారు.

నేతన్నలకు అండగా ప్రభుత్వం: తుమ్మల

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నల నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. రైతన్న ప్రజలకు అన్నం పెడితే, నేతన్న ప్రజల గౌరవాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. గత పాలనలో నేతన్నలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రజా ప్రభుత్వం చెల్లించిందన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్నలకు సంబంధించి రూ.50 కోట్ల మేర రుణాలను మాఫీ చేశామని తెలిపారు. వేములవాడలో రూ.50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేశామని, నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించేలా ప్రభుత్వమే ఆర్డర్లు ఇస్తోందని చెప్పారు. మహిళలు పెళ్లిళ్లకు ధరించే విధంగా నాణ్యమైన చీరలను తయారు చేయిస్తున్నామని తెలిపారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ 2023 డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం, ప్రజలకు మౌలిక వసతులు, నేతన్నల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు శాసనసభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉండగా, సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వం పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు.

పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు: శ్రీధర్‌బాబు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నేతన్నలు, ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని చెప్పారు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు.

నేరెళ్ల బాధితులకు పరిహారం: అడ్లూరి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ నేరెళ్ల బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పరిహారం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరకట్ట వద్ద దళితులకు సంబంధించిన సుమారు 300 ఎకరాల భూమిని పేదలకు అసైన్‌ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులు: ఆది శ్రీనివాస్‌

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనతో అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించిందన్నారు. జిల్లాలో సుమారు రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

మల్కపేట రిజర్వాయర్‌ కాలువ భూసేకరణకు నిధులు మంజూరు చేశారని, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం నేతన్నలకు పెండింగ్‌లో పెట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు భారీగా చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు.

ముంపు గ్రామాల బాధితులకు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేశామని, వేలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 9, 10, 11, 12 కాలువల నిర్మాణానికి భూసేకరణ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

మహేష్‌కుమార్‌ గౌడ్‌ విమర్శలు

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ గత పాలనలో సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకుడి ఆస్తులు ఎన్నికలకోసారి పెరుగుతున్నాయని ఆరోపించారు. ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.

నేరెళ్ల ఘటనను ప్రస్తావిస్తూ అప్పట్లో బాధితులకు న్యాయం కోసం కాంగ్రెస్‌ పోరాటం చేసిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులగణన ద్వారా రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు.

నేరెళ్ల బాధితులకు ఆర్థిక సహాయం

కార్యక్రమం అనంతరం నేరెళ్ల బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular