42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే కేంద్రానికి ఎందుకు
రేవంత్ ప్రశ్న
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2
Why should the Centre give 42 percent BC reservation? Revanth questions
రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గణన చేపట్టామని.. బీసీలకు రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కొనసాగాలన్నా జన గణనలో కుల గణన జరగాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రధాని మోదీకి ఎంటీ సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ పోరు గర్జన మహా ధర్నాలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జన గణనలో కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. జన గణనలో కుల గణన చేర్చి దాని ఆధారంగా విద్యా, ఉద్యోగ, ఉపాధిలో మాత్రమే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ గాంధీ మాటను నిలబెట్టాల్సిన బాధత్య ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. నాది ఏ సామాజికవర్గమైనా… రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు ప్రయత్నించాను. మేం అధికారం చేపట్టిన వంద రోజులు తిరగకముందే బలహీనవర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేశాం. మా పాలన ఏడాది తిరగకముందే కుల గణన పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఫిబ్రవరి 4న చట్టసభల్లో బిల్లులు పెట్టాం. అందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే గా ప్రకటించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయమని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడారు. నాటి దుర్మార్గ పాలకుడు యువత గోసను పట్టించుకోలేదు. ఎంత కొట్లాడినా.. ఎందరు మరణించినా నాటి పాలకుల చెవులకు ఎక్కలేదు. పాదయాత్ర సమయంలో తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టమని నేను చెప్పిన.. యువత ఆ పని చేశారు. మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నాం. రిజర్వేషన్లు పెంచాలనే బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు. సబంద్ధమైన కోరిక, ధర్మబద్దమైన కోరిక.. ధర్మబద్దమైన కోరిక నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకురావాలి. బీసీల రిజర్వేషన్ల పెంపునకు వాళ్లు (బీజేపీ నేతలు) విధానపరంగా వ్యతిరేకం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ నియమిస్తే.. వీపీ సింగ్ మండల్ కమిషన్ దుమ్ము దులిపితే ముందుకు తెచ్చారు. మండల్ కమిషన్‌పై బీజేపీ కుట్ర చేసి కమండల్ యాత్ర మొదలుపెట్టింది. ఆ కమండల్ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ. ఇందిరాగాంధీ దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారు కాదు. కానీ వారికి అమ్మలా వ్యవహరించి.. రిజర్వేషన్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. భూస్వాముల దగ్గర ఉన్న వేల ఎకరాలు గుంజుకొని ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చింది. దళితులు, ఆదివాసీలు ఇళ్లలో ఆమె ఫొటోలు ఇప్పటికి ఉన్నాయి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకం. బలహీన వర్గాల లెక్కలు తేల్చాల్చి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ చేయలేదు’ సీఎం వ్యాఖ్యానించారు.‘రాహుల్ గాంధీ కుల గణన చేయాలని డిమాండ్ చేయడంతో 2025 వచ్చినా జన గణన చేయకుండా వాయిదా వేస్తున్నారు. బలహీన వర్గాలకు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తెలంగాణలో నిలబెట్టుకున్నాం. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందే. అందుకే కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది. కుల గణన చేపట్టి రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేసి దేశానికే తెలంగాణ ఓ దిక్సూచిగా నిలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు’ అని సీఎం చెప్పారు.‘తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం. రిజర్వేషన్ల పెంపు కోరుతూ ఈ అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చింది. బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు.. ఆయన ప్రాణం మాకు వద్దు.. వందేళ్లు ఆయన జీవించాలి.. మాకు రిజర్వేషన్లు పెంచితే చాలు. కురుక్షేత్రానికి ముందు అయిననూ పోయి రావలె హస్తినకు అన్నారు.. ఇప్పుడు మేం ధర్మం కోసం హస్తినకు వచ్చాం. న్యాయమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వచ్చాం.. ఇకపై ఢిల్లీకి రాము. రిజర్వేషన్ల పెంపునకు బలహీన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించాలి. మోదీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేసి రిజర్వేషన్లు సాధిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలోని అన్ని వర్గాల నుంచి నాయకులు ఇక్కడికి వచ్చారని.. ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యతను గుర్తించాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు.తెలంగాణలో బీసీ బిల్లు పెట్టిన సీఎం రేవంత్ రియల్ హీరో అన్నారు నటుడు సుమన్. ప్రధాని మోదీ చొరవ తీసుకుని ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలన్నారు.తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని సూచించారు ఎమ్మెల్సీ విజయశాంతి. అప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు.ను ఎంతోమంది సీఎంలను చూశానని.. కానీ బీసీలకు మేలు చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి మాత్రం సీఎం రేవంతే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.
కాగా.. మహా ధర్నా తరువాత సీఎం రేవంత్ సారథ్యంలోని మంత్రుల బృందం కేంద్రమంత్రులతో భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు ఇవ్వాలని వారిని కోరనుంది.