రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు?
బండి సంజయ్
కరీంనగర్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలు రాకముందే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే.. పథకాలు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో కొర్రీలు పెట్టకూడదన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గాలు చేసిందని.. ప్రజలను మోసం చేసిందని..కాంగ్రెస్ గత ప్రభుత్వంలా చేయొద్దని బండి సంజయ్ సూచించారు.
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై బండి సంజయ్ మండిపాడ్డారు. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని, సీఎంను చెప్పుతో కొడతా అనడం తప్పని, ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అహంకారం బయటకు వస్తోందని, సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని, ముఖ్యమంత్రినే చెప్పుతో కొడతా అనడం కరెక్ట్ కాదని బండి సంజయ్ అన్నారు