కిషన్ రెడ్డి వర్సెస్ కవిత హైదరాబాద్, ఆగస్టు 22: బంగారు కుటుంబం పార్లమెంట్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్‌లో డ్రామా సృష్టించిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల హక్కుల పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన ఆశ్చర్యకరంగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రెండుసార్లు హామీలు ఇచ్చిన బీజేపీ మహిళలను మోసం చేసిందని అన్నారు. పార్లమెంటులో భారీ మెజార్టీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు రాని తమ అభ్యర్థులను వారి పార్టీలో చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారని ఆరోపించారు. దయచేసి మీ రాజకీయ అభద్రతాభావాలను మహిళల ప్రాతినిధ్యంతో ముడి పెట్టద్దని కోరారు. 14 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే స్థానిక సంస్థల మాదిరిగానే రాజ్యాంగబద్ధమైన హక్కు లేకుండా జాతీయ, అసెంబ్లీ స్థాయిలో ఇది సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో సీట్లు పెంచి అందులో 1/3 వంతు మహిళా నేతలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ఫార్ములా ప్రతిపాదించారని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. 33 శాతం అంటే 3+ 3= 6 (ఆరుగురికి టిక్కెట్లు) బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ లాగా జుమ్లాలను అమ్ముకోదని వివరించారు. మహిళా ప్రాతినిథ్యం విషయంలో మీ అభిప్రాయాన్ని వినాలనుకుంటున్నానని కిషన్ రెడ్డికి సూటిగా చెప్పారు. అలాగే టిక్కెట్ల పంపిణీ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు తెలంగాణ మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తాయో చూడాలనుకుంటున్నానని వివరించారు. నిర్మాణ లోపాన్ని రాజకీయం చేయడం దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే అన్ని రాజకీయ పార్టీల ఉద్దేశాన్ని మాత్రమే బహిర్గతం చేస్తుందని తెలిపారు. ఇది ఎన్నటికీ నెరవేరదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తన భారీ మెజార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ… మహిళలకు సమాన స్థానం కల్పించేందుకు ఏమాత్రం కృషి చేయదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.