
—కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి
కరీంనగర్, నవంబర్ 02 (వాయిస్ టుడే): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున, అక్రమంగా డబ్బు, మద్యం, ప్రజలను ప్రలోభపెట్టు ఇతర వస్తువుల అక్రమ తరలింపుకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో విస్తృతస్థాయిలో వాహన తనిఖీలు చేపడుతున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. వారి ఆదేశాల మేరకు జిల్లాలోని పలుచోట్ల కేంద్ర సాయుధ బలగాలు మరియు జిల్లా హెడక్వార్టర్స్ పోలీసులు ఉమ్మడి బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు, మెరుపు దాడులు జరుపుతున్నామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడిన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడమే ముఖ్య ఉద్దేశం అన్నారు



