సిక్కోలు జిల్లాల్లో భార్య, భర్తలు పోటీ
శ్రీకాకుళం, మే 3, (వాయిస్ టుడే )
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి పలు ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఓ చోట అక్కాతమ్ముళ్లు, మరోచోట అన్నా చెల్లెల్లు.. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులే వేర్వేరు పార్టీల తరుఫున బరిలోకి దిగుతూ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ జంట ఎన్నికల బరిలో నిలిచిన వైనం వెలుగు చూసింది. అయితే వారేమీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం లేదు. ఒకే పార్టీ తరుఫున ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనూ ఈ తరహాలో ఓ జంట పోటీ చేస్తోంది. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. అయితే వీరితో పోలిస్తే శ్రీకాకుళం జంటది భిన్నమైన పరిస్థితి, భిన్నమైన కారణం.. అంతకుమించి విభిన్నమైన నేపథ్యం.అసలు వివరాల్లోకి వస్తే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యాట్లవలస గ్రామానికి చెందిన కాయ దుర్గారావు దంపతులు ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాయ దుర్గారావు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థిగా, ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. వీరిద్దరూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వీరు ఇలా ఎన్నికల బరిలో నిలవడానికి కూడా బలమైన కారణమే ఉంది.దుర్గారావు దంపతులకు చేపల అమ్మడమే జీవనాధారం. అలా వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ వ్యాపారం కూడా నిలిచిపోయింది. ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుని బతుకు బండి లాగిద్దామనుకుంటే అది కూడా సమస్యల్లో చిక్కుకుంది. ఈ డీపట్టా భూముల సమస్యపై దుర్గారావు దంపతులు సుమారుగా నాలుగేళ్ల నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. 2020 నుంచి తిరుగుతున్నా కూడా డీపట్టా భూముల సమస్యకు పరిష్కారం లభించలేదు.దీంతో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యకు పరిష్కారం కనుగొనాలని దుర్గారావు దంపతులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరుఫున దుర్గారావు శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి, ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు, తమలా మరెవ్వరూ భూముల సమస్యతో బాధపడకూడదని.. పరిష్కారం కోసమే తాము ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఈ దంపతులు చెప్తున్నారు. పోటీ చేయడం ద్వారా తమలాంటి వారు భూములకు సంబంధించి పడుతున్న సమస్యలపై ప్రజలకు తెలుస్తుందని చెప్తున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, సమస్యల్లో ఉన్న వాళ్లకు అండగా నిలవాలనేదే తమ ఉద్దేశమంటున్నారు ఈ దంపతులు.
సిక్కోలు జిల్లాల్లో భార్య, భర్తలు పోటీ
- Advertisement -
- Advertisement -