భారీ డిమాండ్లతో భార్యా బాధితుల సంఘం
15 ఏళ్ల కిందట పురుడు
విజయవాడ, ఫిబ్రవరి 26, (వాయిస్ టుడే)
Wife victims association with huge demands
సమాజంలో ఇటీవల భార్యాబాధితుల సమస్యలపై చర్చ జరుగుతోంది. భార్యలకు ఏ సమస్యల వచ్చినా.. వారి తరపున నిలబడేందుకు మహిళా సంఘాలు ఉన్నాయి. భర్తలకు వచ్చిన సమస్యలను తీర్చేందుకు ఏ సంఘం ముందుకు రాదు. ఈ నేపథ్యంలోనే భార్యాబాధితుల సంఘం ఏర్పడింది.దేశంలోని మొదటి సారిగా భార్యాబాధితుల సంఘం 2010లో ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో పురుడు పోసుకుంది. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. తాడేపల్లిగూడెం, నందిగామ, హైదరాబాద్, ఖమ్మంలో బలమైన కమిటీలతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2010లో 35 మందితో భార్యా బాధితుల సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో ప్రస్తుతం సుమారు 10 వేల మంది వరకు సభ్యులు ఉన్నారు. 25 మంది క్రియాశీలకంగా కోర్ కమిటీగా ఏర్పడి సంఘం తరపున న్యాయం కోసం గళం విప్పుతున్నారు. అమెరికా , మలేషియా, దుబాయ్‌ల నుంచి కూడా భార్యా బాధితులు ఫోన్‌లో సంప్రదిస్తున్నారని.. జాతీయ అధ్యక్షుడు జి.బాలాజీ రెడ్డి తెలిపారు. భార్యా బాధితుల రక్షణ కోసం చట్టాలు రావాల్సిందేనని అంటున్నారు. గౌరవం కోల్పోతున్నామని, మనశ్శాంతి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, తప్పు లేకుండా పరిహారాలు కోరవద్దని అన్నారు. తమ ఆస్తులకు తమను దూరం చేస్తున్నారని, భార్యలతో ఇబ్బంది పడే భర్తల తరపున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
13 డిమాండ్లు..
1. భార్యలు ఎన్ని రకాల కేసులు పెడితే అన్ని రకాల కేసులకు.. భర్తలు, భర్తల కుటుంబాలందరికీ కూడా కౌన్సెలింగ్‌లు ఇచ్చి సరైన న్యాయం జరిగేలా చూడాలి.
2.భార్యలు ఎన్ని రకాల కేసులు పెడితే అన్ని రకాల కేసులకు హాజరుకావాలి. అలా రెండుసార్లు హాజరుకాని పక్షంలో ఆ కేసులను పూర్తిగా రద్దు చేయాలి.
3.498 (ఏ) గృహ హింస కేసు పెట్టిన ఏడాది తరువాత కేసు తేలినా, తేలకపోయినా కోర్టు విడాకులు మాంజూరు చేసి.. రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలి.
4.498 (ఏ) గృహ హింస తప్పుడు కేసు అని తేలితే.. భార్య, భార్య తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు శిక్ష, భర్తలకు నష్టపరిహారం, పరువు మర్యాదలు ఇప్పించాలి.
5.ఎంసీ, డీవీసీ (డొమెస్టిక్ వైలన్స్)లను చట్టం నుంచి పూర్తిగా రద్దు చేసి.. పెండింగ్‌లో ఉన్న కేసులను రద్దు చేయాలి. జైలు శిక్షలు అనుభవిస్తున్న వారిని వెంటనే విడుదల చేయాలి.
6. పూర్వం ఈ కేసుల వల్ల నష్టపోయిన వారికి భార్యలతో ఆ నష్టపరిహారాన్ని ఇప్పించాలి. ఏడాది పాటు భార్యలకు, భార్యల తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించాలి.
7. గృహ హింస కేసు పెట్టిన తరువాత.. భార్యా భర్తలిద్దరి శాంపిల్స్ డీఎన్ఏ టెస్ట్‌లకు పంపాలి.
8. భార్యలు కేసులు పెట్టిన తరువాత ఒక వేళ పిల్లలు ఉంటే.. భార్యల వద్ద నాలుగు రోజులు, భర్తల వద్ద మూడు రోజులు ఉండేటట్లు అనుమతి ఇవ్వాలి.
9. భర్తలు అవసరం లేదని వెళ్లిన భార్యలకు నష్టపరిహారం చెల్లించకూడదు.
10. భార్యలు పెట్టిన కేసుల వల్ల భర్తలకు ఉద్యోగాలు పోకుండా చూడాలి. భర్తలు, వారి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు భార్యా పిల్లలకు చెందకూడదు.
11. పెళ్లి అయిన ఏడాది తరువాత నుంచి భార్యలు పుట్టింటికి చూడటానికి వెళ్తే.. నెల రోజుల లోపు భర్తల దగ్గరకు రావాలి. అలా రాకపోతే భర్తలకు విడాకులు మంజూరు చేయాలి.
12. భర్తల దగ్గర నుంచి భార్యలు విడాకులు తీసుకున్న తరువాత.. భార్యలు, పిల్లలు భర్తల ఇంటి పేర్లను ఎటువంటి వాటిలో ఉపయోగించకూడదు. అలా ఉపయోగించిన పక్షంలో కోర్టు శిక్ష విధించాలి.
13. మహిళలకు ఎటువంటి చట్టాలు, పథకాలు ఇచ్చారో.. అలాంటి చట్టాలు, పథకాలు పురుషులకు కూడా ఇవ్వాలి.