బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందా?
హైదరాబాద్, ఏప్రిల్ 3,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో మార్పును ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. గత పదేళ్లు వేరు. రానున్న ఐదేళ్లు వేరు. ఈ ఐదేళ్లు కష్టపడితేనే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశముంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల చరిత్రను తిరగరాసే వీలుంది. 1995 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ రెండోసారి కూడా గెలిచింది. అంటే ప్రజలు పదేళ్ల పాటు ఒక ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లే కనపడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పదేళ్లు వెయిట్ చేసే పరిస్థితి లేదంటున్నారు గులాబీ పార్టీ నేతలు. అందుకే వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా తెలంగాణలో ఎగరాలన్న ఆలోచనను కేసీఆర్ చేయాలంటున్నారు. వరసగా రెండు సార్లు గెలిచి… 1995, 1999లో తెలుగుదేశం పార్టీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది. అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. 2014 నుంచి 2023 వరకూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఇలా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా పదేళ్ల పాటు తాము పవర్ లో ఉంటామని భావిస్తుంది. దానిని తిప్పికొట్టాలంటే అది కేసీఆర్ చేతిలోనే ఉందంటున్నారు. అందుకు రెండు విషయాల్లో కేసీఆర్ సత్వరం చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా కోరుతున్నారు. ఒకటి పార్టీ పేరు మార్పు దెబ్బతీసిందన్న ఆందోళన అందరి నేతల్లో వ్యక్తమవుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడంతోనే మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవి చూశామన్నది ఎక్కువ నేతల అభిప్రాయం. తమ మనసులో మాటను పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లోనూ కొందరు నేరుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట లేవనెత్తారు. అయితే అందుకు కేసీఆర్ అంగీకరించాల్సి ఉంది. ఒకసారి పేరు మార్చి మళ్లీ వెనక్కు పోవడం ఎందుకన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పేరు మీదనే మరొకసారి గెలిపించి చూపిద్దామని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కానీ ఎక్కువ మంది నేతలు మాత్రం మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు చేయాలన్న సౌండ్ మాత్రం ఎక్కువగానే వినిపిస్తుంది. జిల్లాల పర్యటనలు చేపడితేనే నేతల వలసలు ఆగుతాయని చెబుతున్నారు. మొన్నటి నల్లగొండ జిల్లా తరహాలోనే ప్రతి జిల్లాలో ఏదో ఒక సమస్యను తీసుకుని పర్యటిస్తే అక్కడి నేతలు మళ్లీ యాక్టివ్ అవుతారని, క్యాడర్ లో కూడా జోష్ పెరుగుతుందని సీనియర్ నేతలు చెబుతున్నారు. గతంలో మాదిరి ఇప్పుడు ప్రజలు లేరని, కేసీఆర్ క్షేత్రస్థాయిలో వచ్చి పోరాటం చేయాలని క్యాడర్ కోరుకుంటుంది. అప్పుడే పార్టీ బలోపేతమవుతుందని, కేవలం ఎన్నికల సమయంలో వస్తే ప్రజలు నమ్మే అవకాశం లేదని అంటున్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిలో కూడా నాయకత్వం మారిస్తే మేలన్న సూచనలు కూడా గులాబీ బాస్ కు అందినట్లు చెబుతున్నారు. మరి కేసీఆర్ రెడీ అవుతారా? జనంలో తిరిగేందుకు సిద్ధపడతారా? అన్న దానిపైనే ఆ పార్టీ భవిష‌్యత్ ఆధారపడి ఉందంటున్నారు.
బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందా?
- Advertisement -
- Advertisement -