హైదరాబాద్, నవంబర్ 18, (వాయిస్ టుడే): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘ధరణి’ పోర్టల్ ఎత్తేసి పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని చూస్తోందని, దీంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పవని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రైతన్నకు భరోసా బీఆర్ఎస్ పార్టీ అని, ధరణి కావాలా? పట్వారీ వ్యవస్థ కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉందని, తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్.1 స్థానంలో నిలిచిందని అన్నారు. ధరణి ఎత్తేస్తే దళారుల రాజ్యం వస్తుందన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తాం. సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తాం. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం.’ వంటి హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు
కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు మంత్రి కేటీఆర్. డిసెంబర్ 3 తర్వాత మహిళల కోసం 4 కొత్త పథకాలు తీసుకొస్తున్నామని చెప్పారు. 400కే సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి 5లక్షల బీమా కల్పిస్తామన్నారు. కామారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు తప్పవన్నారు. పట్వారీ వ్యవస్థ తీసుకువస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని.. అటువంటి వారికి అధికారం ఎందుకివ్వాలని ప్రశ్నించారు.