
—————————————–
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు కే.విరాహత్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విరాహత్ అలీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, యూనియన్ సభ్యుల మద్దతుతో శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్ర శేషు, సహాయ ఎన్నికల అధికారి మల్లయ్యలకు నామినేషన్ సమర్పించారు. అయితే నామినేషన్లకు డిసెంబర్ 29 చివరి రోజు కావడం, ఒకే ఒక నామినేషన్ అందడంతో విరాహత్ అలీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ, దొంతు రమేష్, రాష్ట్ర కార్యదర్శులు ఫైసల్ అహ్మద్, గుడిపల్లి శ్రీనివాస్, గాడిపల్లి మధుగౌడ్ లతో పాటు 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.
అవిశ్రాంతంగా పోరాడుతా ———————————
వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా పోరాడుతానని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన విరాహత్ అలీ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతా, తనపై ఎంతో విశ్వాసంతో టీయూడబ్ల్యూజే సంఘానికి రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్న జర్నలిస్టుల రుణం తీర్చుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా వెనకాడకుండా, అహర్నిశలు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తానని విరాహత్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాల సాధనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.



