ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
– హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి
– ఇక నుంచి ప్రతి నెలా పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేస్తానని స్పష్టం
– పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలకు హెచ్చరిక
– భూములు కోల్పోయిన రైతులకు వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు ఇవ్వాలని ఆదేశం
వాయిస్ టుడే న్యూస్, వికారాబాద్:
వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఇక నుంచి ప్రతి నెలా స్వయంగా తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి వివిధ విద్యాసంస్థల భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలు, విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నిర్మాణ పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతి నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెలా పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు అవసరమైతే ఒక రోజు సైట్‌లోనే బస చేసి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.
పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఎడ్యుకేషన్ హబ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎడ్యుకేషన్ హబ్ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అన్ని నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు.




