బౌద్ధ ధర్మంతోనే ప్రపంచ శాంతి సాధ్యం
అశోక విజయదశమి వేడుకల్లో మధుపాక ఎల్లయ్య, సాయిని నరేందర్
హనుమకొండ, అక్టోబర్ 21 (వాయిస్ టుడే):
World peace is possible only through Buddhism.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలు కలిగిన బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుపాక ఎల్లయ్య అన్నారు. అశోక విజయదశమి సందర్భంగా మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ బౌద్ధ ఆరామంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అమితమైన కోరికలే మానవ దుఃఖానికి కారణమని, కోరికలను నియంత్రించుకోవడం, కరుణ, సమానత్వం, మానవీయ విలువలను పాటించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని గౌతమ బుద్ధుడు వేల సంవత్సరాల క్రితమే బోధించారని తెలిపారు. బౌద్ధ ధర్మాన్ని ఆచరించే దేశాల్లో శాంతియుత జీవనం కొనసాగుతోందని పేర్కొన్నారు. బౌద్ధ ధర్మంలోని మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ స్వీకరించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని అన్నారు.
సత్య చరిత్రను ప్రజలకు తెలియజేయాలి: సాయిని నరేందర్
ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ అశోక విజయదశమి ప్రాధాన్యతను వివరించారు. కళింగ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టాన్ని చూసి చలించిపోయిన అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి అహింస, కరుణ, శాంతి మార్గాన్ని అనుసరించారని తెలిపారు. యుద్ధం ద్వారా శాంతి సాధ్యం కాదని, ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సమానత్వం, సౌభ్రాతృత్వంతోనే శాంతి నెలకొంటుందని అన్నారు.
1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్ దీక్షాభూమిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లక్షలాది మందితో కలిసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని గుర్తుచేశారు. బౌద్ధ ధర్మంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలు భారత రాజ్యాంగంలోనూ ప్రతిబింబించాయని పేర్కొన్నారు. అశోకుడు, బౌద్ధ ధర్మం, అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతమై సమసమాజం ఏర్పడుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు జన్ను పద్మ, మాదిగ జాంబవ జాగృతి సంఘం నాయకులు బొల్లె సాంబయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుట్ల రవీందర్, ఉపాధ్యక్షుడు ఎర్ర శోభన్‌బాబు, ప్రధాన కార్యదర్శి బంగారు బాబు, డీఎస్పీ నాయకులు మేకల సుమన్, సురేష్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బూజు గుండ్ల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి మంత్రి చాణిక్య, బీరం రాము, దేవరాజుగట్టు శ్రీనివాస్, భరత్, మాయవతి, ప్రసాద్, ప్రకాష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.




