లడాఖ్ ప్రాంతంలో ఎత్తైన ఫెన్సింగ్
న్యూఢిల్లీ, ఆగస్టు 22: మన సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి.. నిరంతరం ఇబ్బంది పెట్టాలని చూసే డ్రాగన్ కంట్రీ కంత్రీ ఆలోచనలకు చెక్ పెట్టేదిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైనా సరిహద్దులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. 19400 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మనదేశం తన రికార్డును తానే బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టిస్తుంది. ఇక్కడ ఫైటర్ జెట్ బేస్ కూడా నిర్మించబడుతుంది. తద్వారా చైనా విషయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే.. ఈ రహదారిని ఉపయోగించి.. తగిన సమాధానం చెప్పవచ్చు.ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎత్తైన రహదారి కూడా మన దేశంలోనే ఉంది. ఈ రహదారి ఉమ్లింగ్ లాలో ఉంది. దీనిని 19024 అడుగుల ఎత్తులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఆర్మీ వాహనాల రాకపోకలకు ప్రత్యేకంగా ఈ రహదారిని సిద్ధం చేశారు. ఈ రహదారిని BRO మహిళా అధికారి వైశాలి ఎస్ హివాసే అధ్యర్యంలో ఆల్-వుమెన్ BRO బృందం నిర్మించారు. ఈ రహదారి పేరు అత్యంత ఎత్తైన రహదారిగా గిన్నిస్ బుక్‌లో కూడా నమోదైంది. ఇప్పుడు 19400 అడుగుల ఎత్తులో నిర్మించిన లికారు-మిగ్ లా-ఫుక్చే రహదారి దాని రికార్డును బద్దలు కొట్టనుంది. లడఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో కొత్త రహదారిని నిర్మిస్తున్నారు. ఆల్-వుమెన్ BRO బృందం ఆధ్వర్యంలో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. లిక్రు-మిగ్ లా-ఫుక్చే అని పిలువబడే ఈ రహదారి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఇది 19400 అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశం గుండా వెళుతుంది. ఇది అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అవుతుంది. ఈ రహదారి చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండడం కూడా దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. బిఆర్‌ఓ మహిళా విభాగం ఈ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. కల్నల్ పొనుంగ్ డోమింగ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. కల్నల్ డోమింగ్‌తో పాటు ఇతర మహిళా అధికారులు కూడా ఈ రహదారి పనుల్లో ఉత్సాహంగా నిమగ్నమై ఉన్నారు.


