యూ ట్యూబర్ నందన అరెస్ట్
హైదరాబాద్, సెప్టెంబర్ 7
YouTuber Nandana arrested
ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు పెండింగ్‌లో ఉండటంతో విమానాశ్రయంలో ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.వివరాల్లోకి వెళితే.. నందన, ఆమె భర్త కలిసి లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.ఈ క్రమంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి, ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని, కేసు విచారణ చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
యూట్యూబ్, సోషల్ మీడియాలో యూజర్లకు నందూస్ వరల్డ్ కపుల్ అంటే తెలియని వారుండరు. నందూస్ వరల్డ్ ఛానల్ పేరిట నందన, మధుకర్ కపుల్ చేసిన వీడియోస్ చాలా పాపులర్. ఇదే ఫేమ్‌తో నందన సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో నటించారు. అలాగే, ఓటీటీలో వచ్చిన సంధ్యా నామ ఉపాసతే మూవీలోనూ నటించారు. అయితే, ఈ ఫేమ్‌తో నందూస్ వరల్డ్ జంట తెలుగు విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారనేది వీరిపై ప్రధాన ఆరోపణ. లండన్‌లో ఉద్యోగాలు, వీసాల పేరిట వారి నుంచి భారీగా వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక గుజరాత్, కర్ణాటక నుంచి కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అటు సోషల్ మీడియాలో వీరిదే హాట్ టాపిక్. లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా, నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ః




