ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల ప్రచారంలో రాయి దాడి ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ పైన జరిగిన రాయి దాడి ప్రతిపక్షాల కుట్రగా వైసిపి అభివర్ణిస్తుంటే ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.
ఇక సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం పార్టీ దాడి ఘటనపై జగన్ ను టార్గెట్ చేస్తోంది.
ఆస్కార్ అవార్డులు ఇచ్చేలా యాక్టింగ్
టిడిపి అధికారిక ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతూ ఇదంతా ఎన్నికల్లో ఓట్ల కోసం వైసిపి ఆడుతున్న ప్రీ ప్లాన్డ్ సానుభూతి డ్రామా అని మండిపడుతుంది. తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో జగన్‌పై దాడి, వాళ్ళే చేసుకున్న ఎటాక్ అని పేర్కొంది. ఆస్కార్ అవార్డులు ఇచ్చే అంతగా డ్రామాలాడుతున్నారని ట్విట్టర్లో పేర్కొంది.
డ్రామా 3.0 – రాయి
డ్రామా 1.0 – కోడి కత్తి, డ్రామా 2.0 – బాబాయ్ , డ్రామా 3.0 – రాయి అంటూ జగన్ ను టార్గెట్ చేసింది. గతంలో కోడి కత్తితో దాడి చేయించుకొని సానుభూతి కోసం మొదటి డ్రామా ఆడారని, అది వర్కౌట్ కాకపోవడంతో రెండవ డ్రామాలో బాబాయిపై గొడ్డలి వేటేసి సానుభూతి పొందాడని, ఇక ఇప్పుడు మూడవ డ్రామాలో గులకరాళ్ళ తో తనను తాను కొట్టించుకున్నాడు అని టిడిపి ట్విట్టర్లో పేర్కొంది.
ఇది వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని కలిసి ఆడిన డ్రామా
ఇక తెలుగుదేశం పార్టీ నేతలు సైతం తనదైన శైలిలో జగన్ పై విరుచుకుపడుతున్నారు. వన్ టౌన్‌కి చెందిన రౌడీషీటర్‌తో కలిసి, వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని కలిసి ఆడిన డ్రామా ఇది అంటూ బోండా ఉమా మండిపడుతున్నారు. కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయట పెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ పేర్కొన్నారు.
ఈ నాటకాలు అందుకే
జగన్ సభలకు జనాలు రావడంలేదని, అక్రమాల తాడేపల్లి ప్యాలెస్ ముందే పరిస్థితి ఇలా ఉంటే, జగన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు కాక, ఇంకేమి చేస్తాడు అంటూ మండిపడుతున్నారు. ప్రజాభిమానం లేనివాడికి, ఇలాంటి నాటకాలే దిక్కు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి ఎద్దేవా చేస్తున్నారు.


