పాపం… ఇప్పట్లో బెయిల్ కష్టమే…
విజయవాడ, మే 17, (వాయిస్ టుడే )
Too bad... it's difficult to get bail now...
మాజీ ఎమ్మెల్యే వంశీని కేసుల మీద కేసులు వెంటాడుతున్నాయా? ఇప్పట్లో ఆయనకు బెయిల్ లభించడం కష్టమేనా? ఒక కేసు తర్వాత మరో కేసు మీద పడుతుండడంతో ఇక ఆయన జైలు నుంచి బయటకొచ్చేది కష్టమేనా? అంటే అవుననే సమాధానం వస్తోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయివంశీపై తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు రిమాండ్ విధించడంతో ఇక ఆయనకు ఇప్పట్లో బెయిల్ రానట్లే అన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. అంతేకాదు..వంశీపై పోలీసులు మరో రెండు కేసులను నమోదు చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగిసినట్లే అన్న చర్చ నడుస్తోంది. ఇంతకీ వంశీపై నమోదైన కేసులెన్నీ..గత ప్రభుత్వంలో చేసిన కొన్ని పనులు ఆయన్ని వెంటాడుతున్నాయా?వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. వంశీకి తాజాగా నూజివీడు కోర్టు రిమాండ్లో మరో రిమాండ్ విధించింది. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో న్యాయస్థానం ఆయనకు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. ఇదే కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు కూడా 14రోజుల రిమాండ్ విధించారు.మరోవైపు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. వంశీపై వరుసగా కేసులు నమోదు అవడంతో పాటు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో కొనసాగుతున్నారు. ఇప్పటికే వంశీపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఏ1గా ఉన్నారు. మరోవైపు భూకబ్జా కేసుకు సంబంధించి వంశీపై మరో కేసు నమోదైంది.ఈ రెండు కేసుల్లో ఇప్పటికే వంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయ్యింది. గన్నవరం నియోకజవర్గం కొండపాలూరులో జరిగిన అక్రమ క్వారీ గ్రావెల్ తవ్వకాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీ, అతని అనుచరులపై గనులశాఖ ఏడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్టు సమాచారం. మొత్తం 58 పేజీలతో గనులశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపైన పిటి వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.వల్లభనేని వంశీపై 2019 ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు ఇదివరకే నమోదైనా..ఆ కేసును రీ ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. 2019లో వంశీ తన నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఇళ్ల పట్టాలిచ్చారు. స్థలం ఎక్కడో చూపకుండా అప్పట్లో పట్టాలిచ్చారు. ఈ వ్యవహారం ఎన్నికలయ్యాక వెలుగుచూసింది. బాపులపాడు మండలంలో వెలుగుచూసిన నకిలీ ఇళ్ల పట్టాల ఉదంతం గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో కూడా ఉందని తేలింది. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ పట్టాలిచ్చారన్నది వంశీపై అభియోగం. బాపులపాడు తహసీల్దార్పీఎస్ లో కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతే వంశీ..జగన్కు దగ్గరకావడంతో ఆ తర్వాత కేసు మరుగున పడిపోయింది. అయితే గన్నవరం ఎమ్మెల్యే డిమాండ్తో ఈ కేసు రీ ఓపెన్చేసే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, అనుమతులు లేకుండా 210 కోట్ల మేర మట్టిని అక్రమంగా తరలించినట్లు విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా నిర్ధారించినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వంశీ తప్పించుకోకుండా ఉండేందుకు కేసులన్నీ బనాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకొచ్చిన సమయంలోనే ప్రభుత్వాసుపత్రి సమీపంలో నిఘా వర్గాలకు చెందిన అత్యున్నత అధికారులు భేటీ అయ్యారట. రెండు జిల్లాల్లో వంశీ చేసిన అరాచకాలేంటి? వాటికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? వంటి వివరాలను సేకరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వంశీ వ్యాపార కార్యకలాపాలు ఏంటి? వంశీ అనుచరులు, వారిపై ఉన్న వివాదాలు వంటి వాటిపై కూడా ఆరా తీస్తున్నారు.ఇలా ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదు చేసి ఆయన్ని విజయవాడ జైలు నుంచి బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. ఒక కేసులో బెయిలొస్తే…మరో కేసును బనాయించి జైల్లోనే ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారట. వైసీపీ హయాంలో ఆయన చేసిన అవినీతి చిట్టా మొత్తాన్ని వెలికితీయాలన్న ఆలోచనలో ఉందట కూటమి సర్కార్. మరి రానున్న రోజుల్లో వంశీ రాజకీయ భవిష్యత్ ఏంటన్నదది ఆసక్తికరంగా మారింది. వరుసు కేసులతో ఇలా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే ఉంటారా లేక కొద్ది రోజుల తర్వాత బెయిల్ పై బయటకు వస్తారా అన్నది చూడాల్సి ఉంది.