తీవ్ర ఎండల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Remain vigilant in light of severe heat: MP Vaddiraju Ravichandra
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు Vaddiraju Ravichandra విజ్ఞప్తి చేశారు. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.
చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ మంచినీరు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రయాణికులు, కార్మికులు, రైతులు, చిరు వ్యాపారులు ఎండలో ఎక్కువసేపు పని చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైతే టోపీలు, గొడుగులు, తడి వస్త్రాలు ఉపయోగించి ఎండ నుంచి రక్షణ పొందాలని సూచించారు.
వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం పొందాలని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.



