1000 కోట్ల ఆదాయం…1000 కోట్ల బంగారం
తిరుమల, ఏప్రిల్ 24,
తిరుమల శ్రీనివాసుని సన్నిధి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా వెలిగిపోతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా జనం తరలి వస్తుంటారు. భక్తి శ్రద్దలతో వేంకటేశుని ఆరాధన చేస్తారు. దీంతో నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల గిరులు మార్మోగుతుంటాయి. తిరుమల వెళ్లిన భక్తులు స్వామివారికి విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. వందలాది ఏళ్లుగా ఏడుకొండల స్వామికి వివిధ రూపాలలో కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. అలాగే శ్రీనివాసుడి ఆదాయం కూడా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. తిరుపతి దేవస్థానం హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 2023-24 ఏడాదిలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ ఏడాదికి గాను రూ.1,161కోట్లు నగదు, 1,031 కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు సమాచారం.టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసింది. దీంతో దేవస్థాన డిపాజిట్లు మొత్తంగా రూ.18 వేల కోట్లకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ రూ.1,200 కోట్లు దాటిందట. గత ఐదేళ్ల కాలంలో వడ్డీ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో రూ.500 కోట్లు యాడ్ అయి వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,200 కోట్లకు చేరింది. వేసవి కావడంతో రోజురోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండక తప్పడం లేదు. ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లు దాటుతోంది. కేవలం హుండీ ద్వారా సంవత్సరానికి 1200 కోట్లకు పైగా ఇన్‌కమ్ వస్తోంది. దీనికి దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఇచ్చే విలువైన కానుకలు అదనం.
1000 కోట్ల ఆదాయం…1000 కోట్ల బంగారం
- Advertisement -
- Advertisement -