ఘనంగా సద్గురు త్యాగరాజస్వామివారి 177వ ఆరాధనోత్సవం
తిరుపతి
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజస్వామివారి 177వ‘పుష్యబహుళ పంచమి’ ఆరాధనోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి పంచరత్నకృతుల బృందగానం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తిరుపతికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు ఈ బృందగానం చేశారు.
: త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని శ్రీ నటరాజస్వామి, శ్రీ త్యాగరాజస్వామివారి పంచలోహ విగ్రహాలకు, శ్రీసీతారామలక్ష్మణులు, హనుమంతుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్వీ నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల మంగళవాయిద్యంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దు బాల పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్నకృతుల బృందగానం సంగీతప్రియులను మంత్రమగ్ధులను చేసింది.
ముందుగా నాట రాగం, ఆది తాళంలో ‘జగదానందకారక జయజానకీ ప్రాణనాయక…. కీర్తనతో ప్రారంభించారు. ఆ తరువాత వరుసగా గౌళరాగం, ఆదితాళంలో ‘దుడుకుగల న న్నేదొర కొడుకు బ్రోచురా…’, ఆరభి రాగం, ఆదితాళంలో ‘సాధించెనే ఓ మనసా(సమయానికి తగు మాటలాడెనె)…’, వరాళి రాగం, ఆదితాళంలో ’కన కన రుచిరా – కనకవసన! నిన్ను…’, శ్రీ రాగం, ఆదితాళంలో ‘ఎందరో మహానుభావు – లందరికి వందనము…’ ఐదు పంచరత్న కృతులను రాగయుక్తంగా ఆలపించారు. గాత్ర సంగీత కళాకారులతో పాటు వీణ, వయోలిన్, వేణువు, మృదంగం తదితర అన్ని వాయిద్యాల కళాకారులు బృందగానంలో అత్యద్భుతంగా సహకారం అందించారు. ఈ బృంద గానంలో కాత్ర సహకారం అందించిన వారు కె.వందన, శైలజ, చిన్నమ్మదేవి,సంగీత లక్ష్మి బృందం, వయోలిన్ పై జయరాం , మృదంగంపై సుధాకర్ రమేష్ వీణపై శ్రీవాణి తదితరులు సహకారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు, కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థిని విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.