తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ‘బతుకమ్మ’
తెలంగాణ నేల అనగానే సంస్కృతికి శ్వాస గా, సాహిత్యానికి జీవనాడి గా, రాజకీయ చైతన్యానికి ప్రతీక గా నిలుస్తుంది. అటువంటి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబం గా బతుకమ్మ పండుగ ను జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదనీ, అది ఈ గడ్డ అస్తిత్వ పోరాటాల అద్దం గా, జానపద సాహిత్య శోభ గా వర్ణిస్తారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి సౌందర్యానికి నిలువెత్తు రూపం బతుకమ్మ పండుగ. వర్షాకాలపు చివరిలో, శరదృతువు ఆరంభంలో ధరణి ముస్తాబైన వేళ… చెరువులన్నీ జలకళ ను సంతరించుకున్న శుభ తరుణంలో ఈ పూల పండుగ వస్తుంది. మట్టితో, నీటితో, పూలతో మనుషులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటిచెప్పే ఒక అద్భుతమైన సంస్కృతి బతుకమ్మ ! అక్టోబరు 10 నుండి అక్టోబరు 18 వరకు జరగనున్న ఈ వేడుకలు, తెలంగాణ సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని చాటిచెప్పే ఒక చారిత్రక సందర్భం గా తెలంగాణ ఆడబిడ్డలు భావిస్తారు.
సాహిత్య కోణం: జానపద గేయాల జీవన వేదం
బతుకమ్మ పండుగకు, తెలంగాణ సాహిత్యానికి విడదీయరాని బంధం ఉంది. లిఖిత సాహిత్యం కంటే ఎంతో బలమైన మౌఖిక (జానపద) సాహిత్యానికి బతుకమ్మ పాటలే సజీవ సాక్ష్యం. బతుకమ్మ వైభవాన్ని, ఈ నేల తీరును ప్రముఖ కవి కలిశెట్టి అప్పారావు తన కవిత్వంలో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు:
“గునుగు పూల గుత్తు లల్ల.. తంగేడు వనములల్ల..
ప్రకృతి పరవశించి పాడే.. పరమాత్ముని పాట బతుకమ్మ !
ఆడబిడ్డల ఆత్మ గౌరవమై.. అస్తి త్వపు పోరాట మై..
తెలంగాణ గుండె చప్పుడు గా నిలిచే.. పూల జాతర బతుకమ్మ !” అని ఆయన కొనియాడారు.
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…” అంటూ సాగే ప్రతి పాట లోనూ ఈ నేల కష్టాలు, సుఖాలు, బంధాలు, అనుబంధాలు నిండి ఉంటాయి. శ్రమజీవుల చెమట చుక్కలు, ప్రకృతిపై ఉన్న మమకారం కవితాత్మకంగా ఆ పాట లో వినిపిస్తాయి.
• చారిత్రక గాథ ! కాకతీయుల కాలం నాటి వీరగాథల నుండి నిజాం విముక్తి పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల వరకు ఎన్నో చారిత్రక సత్యాలు ఈ పాటల రూపంలో తరతరాలుగా సజీవంగా సాగుతున్నాయి. మహిళల నోట వచ్చే ప్రతి చప్పట్ల చప్పుడు ఒక లయబద్ధమైన కవిత్వం గా రూపుదిద్దుకుంది.
రాజకీయ కోణం లోనూ, సంస్కృతీ పునరుజ్జీవనం లోనూ బతుకమ్మ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో బతుకమ్మ పోషించిన పాత్ర అనన్య సామాన్యం !
మలిదశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ఒక రాజకీయ ఉద్యమ ఆయుధంగా మారింది. సీమాంధ్ర పాలకుల సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం బతుకమ్మను వీధి వీధినా ఎత్తి పట్టి, తమ ప్రత్యేక గుర్తింపును చాటిచెప్పింది. ఢిల్లీ వీధుల్లోనూ బతుకమ్మను ఆడి పాలకుల కళ్లు తెరిపించిన చరిత్ర ఈ పండుగది.
స్వరాష్ట్ర సిద్ధి తర్వాత బతుకమ్మ ను ప్రభుత్వం “రాష్ట్ర పండుగ” గా ప్రకటించి సముచిత గౌరవం ను, ప్రాధాన్యత ను ఇచ్చింది.
తొమ్మిది రోజుల నైవేద్యాల వైవిధ్యం
ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు సాగే తొమ్మిది రోజుల్లో రోజూ ఒక ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు.
* ఎంగిలిపూల బతుకమ్మ (మొదటి రోజు): నువ్వులు, నూకలు, పెసరపప్పుతో చేసిన నైవేద్యం.
* అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ… ఇలా రోజూ ప్రత్యేక పిండివంటలు సమర్పిస్తూ, ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ నాడు ఎలాంటి నైవేద్యం పెట్టకుండా భక్తిని చాటుకుంటారు.
* సద్దుల బతుకమ్మ (చివరి రోజు): పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, నువ్వుల అన్నం, కొబ్బరన్నం వంటి ఐదు రకాల సద్దులతో పాటు ఎంతో రుచికరమైన ‘మలీద ముద్దల’ను నైవేద్యంగా సమర్పిస్తారు.

బతుకమ్మ తయారీ ఒక కళ. ప్రకృతి సిద్ధంగా లభించే ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు, చామంతి, బంతి, కట్ల, గుమ్మడి పూలను సేకరించి, తాంబాలంలో రంగురంగుల వలయాలుగా, గోపురం ఆకారంలో పేరుస్తారు. ఆ పూల శిఖరం పైన పసుపుతో చేసిన ‘గౌరమ్మ’ను ప్రతిష్ఠిస్తారు. సాక్షాత్తూ ప్రకృతి మాతనే లక్ష్మీ, పార్వతుల స్వరూపంగా భావించి పూజించే అరుదైన సంప్రదాయం ఇది.
తంగేడు, గునుగు, చామంతి, పట్టుకుచ్చు పూలతో పేర్చే బతుకమ్మ… శ్రేణీకృత సమాజంలోని వైవిధ్యాన్ని, ఐక్యతను సూచిస్తుంది. అన్ని రకాల పూలు కలిసి ఒకే గోపురంగా మారడం వెనుక సామాజిక సమరసత దాగి ఉంది. పూల శిఖరంపై కొలువుదీరే పసుపు గౌరమ్మ సృష్టికి మూలమైన స్త్రీ కి, ప్రకృతి కి తెలంగాణ నేల ఇచ్చే అత్యున్నత గౌరవం గా చెప్పొచ్చు !
బతుకమ్మ అంటే ఒక సామాజిక చైతన్యం, అది సాహిత్య సృజన మాత్రమే కాక రాజకీయ ప్రతిఘటన గా చరిత్రకెక్కింది. కులమతాల సరిహద్దులను చెరిపేస్తూ, ఊరువాడ ఏకమై జరుపుకునే ఈ ఉత్సవం తెలంగాణ ప్రజల సమిష్టి సంకల్పానికి నిదర్శనం. చెరువుల చెంత చేరి… చప్పట్ల చప్పుడుతో …
సాయంత్రం కాగానే రంగురంగుల పట్టుచీరలు, సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, చిన్నపిల్లలు బతుకమ్మలను గ్రామ చౌరస్తా ల్లోనో లేదా గుడి ప్రాంగణా ల్లోనో ఉంచుతారు. అందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాడే జానపద పాటలు లయబద్ధంగా సాగుతాయి. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…” అంటూ సాగే పాటల్లో మహిళల కష్టసుఖాలు, పురాణ గాథలు, సామాజిక జీవనం ప్రతిబింబిస్తాయి. చీకటి పడ్డాక బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువు నీటిలో నిమజ్జనం చేస్తారు. పర్యావరణ రక్షణకు ప్రతీక
బతుకమ్మ పండుగ వెనుక గొప్ప శాస్త్రీయ కోణం ఉంది. ఇందులో ఉపయోగించే తంగేడు, గునుగు, వేప పూలలో అద్భుతమైన క్రిమిసంహారక, ఔషధ గుణాలు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువుల్లో చేరే మలినాలను, బ్యాక్టీరియాను ఈ పూలు హరిస్తాయి. వేలాది బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు శుద్ధీకరణ కు గురవుతుంది. పర్యావరణాన్ని ప్రేమించడం, కాపాడుకోవడం మన పూర్వీకులు నేర్పిన జీవన విధానం అనడానికి బతుకమ్మ ఒక నిదర్శనం..!
సమిష్టి తత్వానికి, ఆడబిడ్డల అనుబంధానికి బతుకమ్మ వేదిక. పుట్టింటికి వచ్చిన కూతుళ్ల తో ఇళ్లన్నీ కళకళ లాడుతుంటాయి. కులమతాలకు అతీతంగా, ఊరు వాడ ఏకమై జరుపుకునే ఈ పూల పండుగ…తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యాన్ని, సాహిత్య సౌరభాన్ని గుబాళిస్తూ సాగే ఈ పూల జాతర యావత్ తెలంగాణ సమాజానికి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ… అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు !……( గిరి ప్రసాద్ సోముల… జర్నలిస్ట్..! 9490063550 ).




