- Advertisement -
ప్రజాభవన్ కు 2008 డీఎస్సీ అభ్యర్ధులు
2008 DSC candidates to Praja Bhavan
హైదరాబాద్, జనవరి 3, (వాయిస్ టుడే)
కొలువు గ్యారంటీ అనే ప్రకటనతో ఆనంద పడ్డారు. సర్కారు బడిబాట పట్టే అవకాశం కల్పించారని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇటు ప్రైవేటు స్కూల్లో కొలువుపోయి.. అటు సర్కారు వారి ప్రకటనా ప్రకారం పోస్టింగ్ రాక.. ప్రజాభవన్ కు క్యూ కట్టారు. వీళ్లంతా 2008 డీఎస్సీ అభ్యర్ధులు. తమకు న్యాయం చేయాలంటూ ఇలా ప్రజాభవన్ లో ఆందోళన చేపట్టారు. తెలంగాణ 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల తెలంగాణ కాబినేట్ నిర్ణయించింది. ఆ మేరకు తెలంగాణ విద్యాశాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. జిల్లాల వారిగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.ఇక కొలువులో చేరడమే తరువాయి అనుకున్నారు. ఇక ప్రభుత్వ బడి పడదామన్న ఉద్దేశంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు కూడా వదిలేశారు. తమకు సెప్టెంబర్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు మూడు నెలలు గడిచినా నియామక పత్రాలు ఇవ్వలేదంటూ.. బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు నియామక పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డామని, తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.మీరు చేసిన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ల వల్ల తమ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి.. ఆత్మహత్యలకు దారితీసే విధంగా ఏర్పడిందని.. డీఎస్సీ 2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసేందుకు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి రెండు, మూడు నెలలు గడుస్తున్న పోస్టింగ్ రాకపోవడంతో.. తమ సర్వీస్ కాలపరిమితిని, ఆ సమయం లోని ప్రయోజనాల్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తమ విన్నపాన్ని తక్షణమే ప్రభుత్వం ఆలకించి ఒకవారంలోనే ఉద్యోగంలో చేరేలా అభ్యర్ధులు వేడుకున్నారు.
- Advertisement -