3 పథకాలకు 30 వేల కోట్లు…
నిధులు ఎలా…
26 టెన్షన్
30 thousand crores for 3 schemes...
How to fund...
హైదరాబాద్, జనవరి 16, (వాయిస్ టుడే )
26 జనవరి. ఈ డేట్ గుర్తొస్తేనే కంగారు పడుతోందట కాంగ్రెస్ సర్కార్. గణతంత్ర్య దినోత్సవం, రాజ్యాంగం అమలైన రోజైన జనవరి 26 నుంచి పలు కీలక పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు పథకాలకు వేల కోట్ల రూపాయలు అవసరం ఉండగా ప్రభుత్వ ఖజానాలో మాత్రం అంత డబ్బు లేదట.కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు-పెన్షన్లు, రోటీన్‌గా జరిగి అభివృద్ది సంక్షేమ పథకాలకే నిధులు సరిపోవడం లేదట. పైగా గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీలు, నెలవారి వాయిదాలు చెల్లించే సరికే కాంగ్రెస్ సర్కార్‌కు తలప్రాణం తోకకు వస్తోందట.రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి 12 వేల రూపాయలను ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా భూములన్నింటికీ కాకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఆ లెక్కన చూసుకున్నా తెలంగాణలో దాదాపు కోటీ 40లక్షల ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అంటే రైతు భరోసా మొదటి విడత జనవరి 26 ప్రారంభిస్తే ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున దాదాపు కోటీ 40లక్షల ఎకరాలకు దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇక జనవరి 26 నుంచి భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నాయని నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా, వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజూ కూలీ పనులకు వెళ్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయట. ఈ కార్డుదారుల్లో దాదాపు 22 లక్షల మందికి భూమి లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరికి రైతు భరోసా కింద మొదటి విడతలో 6వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే 1,320 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.రైతు కూలీలను అర్హులుగా గుర్తించే విషయంలో డైలమాలో ఉందట సర్కార్. ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోందట. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలుగా ఉన్న రైతు కూలీలు 46 లక్షల మందికి ఏడాదికి 12 వేల చొప్పున చెల్లిస్తే 5వేల 200 కోట్లు అవసరం అవుతాయి. అంటే మొదటి విడతలో 6వేల చొప్పున ఇచ్చి 2వేల 600 కోట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులను చెల్లించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్నారు అధికారులు.
ఇక జనవరి నెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణలో దాదాపు 84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల ఆర్ధిక సాయంలో భాగంగా మొదటి విడతలో లక్ష రూపాయల చొప్పున చెల్లించినా 5 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే రైతు భరోసాకు 8వేల 400 కోట్లు, రైతు కూలీలకు 1,320 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5వేల కోట్లు..మొత్తం కలిపి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇక జవనరి 26 తర్వాత నాలుగు రోజులకే ఫిబ్రవరి 1న ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు మరో 4వేల 500 వేల కోట్లు కావాలి. అంటే తెలంగాణ సర్కార్‌కు ప్రస్తుతం దాదాపు 20 వేల కోట్ల రూపాయలు అవసరం.ప్రజల్లో నమ్మకం పోతుందని, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారతామనే ఆందోళన..ఇక రోటీన్‌గా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా డబ్బులు కావాల్సిందే. అందుకే జనవరి 26 వస్తోందంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కంగారు పడుతోందట. ఈ నేపథ్యంలోనే ఖాజానాను నింపుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.ఏడాది కాలంగా నానుతూ వస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను జనవరి 26న ప్రారంభించకపోతే ఇటు ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో పాటు, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతామని రేవంత్ సర్కార్ ఆందోళన చెందుతోందట.ఎలాగైనా ఖజానాకు 20 వేల కోట్ల రూపాయలను జమచేసి మాటిచ్చినట్లు ఆయా పథకాలను అమలు చేసి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను సమీకరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా తెలియాలంటే జనవరి 26వరకు వెయిట్ చేయాల్సిందే.