Sunday, September 8, 2024

ఎన్నికల బరిలో 33 మంది మహిళలు…..

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 25, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రధాన పార్టీలు మూడింటి నుంచి 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ 8 మంది మహిళలను పోటీలో నిలపగా, కాంగ్రెస్‌ 11 మందిని బరిలో దించింది. బీజేపీ, జనసేన కూటమి నుంచి 14 మంది మహిళలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి 13, జనసేన నుంచి ఒక మహిళా అభ్యర్థి ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపాయి. ఈ 33 మందిలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనుభవం ఉన్నవారు కాగా, మరికొందరు కొత్తవారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(ఎస్సీ) స్థానం నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ మహిళలకే టికెట్‌లు ఇచ్చాయి. ఎస్టీ నియోజకవర్గం ములుగులోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు. బరిలో ఉన్న మహిళా అభ్యర్థుల ప్రత్యేకత తెలుసుకుందాం..ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 32 ఏళ్ల బోగ శ్రావణికి రాజకీయ నేపథ్యం ఉంది. బీఆర్‌ఎస్‌లో ఉంటూ జగిత్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌పై వివిధ ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఆమె బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. బీజేపీ ఆమెకు టికెట్‌ ఇవ్వడంతో ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. బీడీఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌) చదువుకున్న ఆమె రాజకీయాలను ప్రధాన వృత్తిగా స్వీకరించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. హేమాహేమీలను బోగ శ్రావణి ఢీకొడుతున్నారు.గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న 40 ఏళ్ల సరిత తిరుపతయ్యకు ఇప్పటికే రాజకీయ అనుభవం ఉంది. అయితే, శాసనసభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. కొద్ది నెలల కిందట వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే గెలిచిన ఆమె అనూహ్యంగా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కూడా అయ్యారు. అయితే, శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ సంపాదించి పోటీలో నిలిచారు. సరిత హైదరాబాద్‌లోని నాంపల్లిలో మైక్రోబయాలజీలో బీఎస్సీ చదివారు. గద్వాలలో 1999లో గట్టు భీముడు మినహా ఇటీవల కాలంలో రెడ్డి సామాజికవర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం ప్రధాన పార్టీలలో బీఆర్‌ఎస్‌ మినహా మిగతా రెండు పార్టీలూ బీసీలకు అవకాశం ఇచ్చాయి. బీఆర్‌ఎస్‌ నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్‌ నుంచి కురుమ సామాజికవర్గ నేత సరిత తిరుపతయ్య, బీజేపీ నుంచి బీసీ అభ్యర్థి బోయ శివ పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నేత డీకే అరుణ తాను పోటీలో ఉండబోనని, బీసీలకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరి పోటీ నుంచి తప్పుకొన్నారు.

పాలకుర్తి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్న 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డికి రాజకీయ అనుభవం ఏమీ లేదు. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు సంపాదించారు. ఈ ఎన్నికలలో ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో టికెట్‌ దక్కలేదు. దీంతో ఆమె కోడలు యశస్వినిరెడ్డికి టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. యశస్విని భర్త రాజమోహన్‌రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటారు. ఆయనకు కూడా భారత పౌరసత్వం లేదు. యశస్విని హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుకున్నారు. వివాహమైన తరువాత భర్తతో అమెరికా వెళ్లినప్పటికీ మళ్లీ కొన్నాళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికలలో పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె నామేషన్‌ చెల్లదంటూ ఫిర్యాదులు వచ్చాయి. అధికారులు ఆమె నామినేషన్‌ పరిశీలించి నిబంధనల ప్రకారం ఉందంటూ ఆమోదించడంతో బరిలో నిలిచారామె. పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పోటీలో ఉండగా బీజేపీ నుంచి లేగ రామ్మోహన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో పోటీ పడుతుండడంతో ఈ యువతి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అందరిలో ఆసక్తి కలిగిస్తున్నారు.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 36 ఏళ్ల లాస్య నందితను పోటీలో నిలిపింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్‌ఎస్‌ నేత సాయన్న మరణించడంతో ఆయన కుమార్తె లాస్య నందితకు పార్టీ అవకాశం ఇచ్చింది. లాస్య నందిత ఇంతకుముందు ఒకసారి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇంకో ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న నందిత హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం, కార్పొరేటర్‌గా పనిచేయడంతో నియోజకవర్గంలో చాలామందికి పరిచితురాలే.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 43 ఏళ్ల జీవీ వెన్నెల పోటీ చేస్తున్నారు. ఇటీవల మరణించిన విప్లవ గాయకుడు గద్దర్‌ కుమార్తె ఈమె. విద్యాసంస్థను నడుపుతున్న ఈమెకు ప్రత్యక్ష రాజకీయాలలో అనుభవం లేదు. ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఈమె విద్యారంగంలో పనిచేస్తున్నారు. తండ్రి మరణం తరువాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి అవకాశం రావడంతో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.ఎస్టీ నియోజకవర్గం ములుగులో బీఆర్‌ఎస్‌ పార్టీ 29 ఏళ్ల బడే నాగజ్యోతికి అవకాశం కల్పించింది. శాసనసభ ఎన్నికలలో తొలిసారి పోటీ చేస్తున్నప్పటికీ నాగజ్యోతికి రాజకీయ అనుభవం ఇప్పటికే ఉంది. 2019లో ఆమె తొలిసారి సర్పంచిగా గెలిచి రాజకీయాలలో అడుగుపెట్టారు. అనంతరం తాడ్వాయి నుంచి జెడ్పీటీసీగా గెలిచి ములుగు జిల్లాలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. కొద్దినెలల కిందట ములుగు జెడ్పీ చైర్మన్‌ మరణించడంతో నాగజ్యోతి ఇంచార్జ్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. నాగజ్యోతి కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీ చదివారు, బీఈడీ కూడా పూర్తి చేశారు. నాగజ్యోతి తల్లిదండ్రులు ఇద్దరూ మావోయిస్ట్‌ పార్టీలో పనిచేశారు. ములుగు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్కది మావోయిస్ట్‌ నేపథ్యమే.ప్రస్తుత ఎన్నికలలో సీతక్క మరోసారి ములుగు నుంచి పోటీ చేస్తున్నారు.హైదరాబాద్‌ నగరంలోని సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో తలపడుతున్నారు 52 ఏళ్ల కోట నీలిమ. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నీలిమ చాలాకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు పవన్‌ ఖేడా ఈమె భర్త. జర్నలిస్ట్, రచయిత్రి అయిన నీలిమ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.

ప్రస్తుత ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డిలతో నీలిమ పోటీ పడుతున్నారు.సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న 43 ఏళ్ల రాణి రుద్రమ. గతంలోనూ ఎన్నికలలో పోటీ చేశారు. జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. యువ తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీలో చేరారు. ఎంసీఏ, ఎంసీజే చదువుకున్న ఆమె ప్రస్తుత ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారు.భూపాలపల్లిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 42 ఏళ్ల చందుపట్ల కీర్తిరెడ్డి కుటుంబం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంది. ఆమె మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు. 2018 ఎన్నికలలోనూ ఆమె బీజేపీ నుంచి భూపాలపల్లిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫిజియో థెరపీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన కీర్తిరెడ్డి ప్రస్తుత ఎన్నికలలో మరోసారి తలపడుతున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి గండ్ర సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్