చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు
ఎమర్జెన్సీ పాలన దేశానికి ఓ మాయని మచ్చ
దేశ ప్రజల గొంతు నొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలకు నిదర్శనం
కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం
ఇందిరను మించిన దురాలోచన రాహుల్ గాంధీది
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్
దేశంలో ఎమర్జెన్సీ పాలనకు నేటికి 50 ఏళ్లు. 1975 జూన్ 25 నుండి 21 నెలలపాటు ఎమర్జెన్సీ పాలన పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దేశ ప్రజల గొంతును నొక్కేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనం. అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ విరుద్దంగా ఎన్ని అడ్దదారులైన తొక్కేందుకు, చివరకు ప్రజల ప్రాణాలను తీసేందుకు, ప్రజ్వాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడదనే దానికి ఎమర్జెన్సీ పాలనే ఓ ఉదాహరణ అని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతిపక్ష నాయకులను, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, జనసంఘ్ నాయకులను మీసా కింద జైళ్లలో పెట్టారు. పత్రికలపై సెన్సార్ విధించారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరించారు. మానవ హక్కులను, స్వేచ్ఛను హరించి వేశారు. ప్రశ్నించిన ఎంపీల సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే.
తెలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన డీఎస్పీ రెడ్డి జంగారెడ్డి, వి.రామారావు , జూపూడి యజ్ఞ నారాయణ, పీవీ చలపతి రావు , వెంకయ్య నాయుడు, సీహెచ్ విద్యాసాగర్ రావు , ఇంద్రసేనారెడ్డి , అశోక్ యాదవ్, తదితర ఏబీవీపీ, జనసంఘ్ కార్యకర్తలతోపాటు చాలా మంది సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే. ఎమెర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ బృందం చేసిన అరాచకాలకు అంతులేదని అన్నారు.
ఎమర్జెన్సీ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ ను ఓడించినా, ఆ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడం సిగ్గు చేటు. కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కాంగ్రెస్ కూలదోసింది. 1947 నుంచి 2014 వరకు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాంగ్రెస్ ఏకంగా 90 సార్లు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసింది.
అబద్ధాలను ప్రజల్లోకి ప్రచారం చేయడం, ఎన్నికల యంత్రాంగంపై నిరాధార ఆరోపణలు, మైనారిటీల బుజ్జగింపు, ఓటుబ్యాంకు రాజకీయాలు, విభజన రాజకీయాలు, ఎన్నికల హింస, ఓటర్లను ప్రలోభ పెట్టడం, రాజ్యాంగం దాని సూత్రాల పట్ల గౌరవం లేకపోవడం వంటివి కాంగ్రెస్ లక్షణాలని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తారుమారు చేస్తుందని, రిజర్వేషన్లను నాశనం చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూసిన కాంగ్రెస్ కు దేశ ప్రజలు తగిన బుద్ది చెప్పినా ఆ పార్టీ నేతలు మారలేదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీని మించి పోయారు. భారతదేశాన్ని అస్థిరపరచడంలో, బలహీనపరచడంలో విదేశీ శక్తుల పాత్ర ఉందనే సాకుతో అధికారాన్ని నిలుపుకునేందుకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే.. అధికారం కోసం ఆయన మనవడు రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పర్యటిస్తూ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అనే ముసుగులో భారత్ లో పాశ్చాత్య దేశాల జోక్యం అవసరమంటూ నిస్సిగ్గుగా వేడుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారు.
ఇకనైనా కాంగ్రెస్ కుటిల రాజకీయాలను, చీకటి ఒప్పందాలను వీడి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాలి. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్ధవంతంగా చర్చ జరిగేందుకు సహకరించాలి. వాటికి పరిష్కార మార్గాలను సూచించాలని కోరుతున్నానని అన్నారు.
చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు
- Advertisement -
- Advertisement -