75 వసంతాల చైనా
75 Spring China
75 ఏళ్ల కిందట, 1949, అక్టోబర్ 1న చైనాలో ప్రజారాజ్యం ఏర్పాటును ప్రపంచానికి ప్రకటించాడు, మావో జెడాంగ్. తాము పురుడుపోసిన ఈ నూతన సమాజానికి, ‘సోషలిస్ట్ రిపబ్లిక్’ అన్నపేరు పెట్టలేదు. ఈ సరికొత్త చైనాకి పీపుల్స్ రిపబ్లిక్ అని నామకరణం చేశారు కమ్యూనిస్టులు. ఇప్పుడే ఏర్పడిన ఈ ప్రజారాజ్యం, వెనువెంటనే సామ్యవాద దేశంగా మారబోదన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ అంచనా. 1931లో జపాన్ సామ్రాజ్య వాదులు ఉత్తర చైనాను ఆక్రమించినప్పుడు మొదలై పద్ధెనిమిదేళ్ల పాటు మండిన యుద్ధపు మంటల్లో కోటి 50 లక్షల మంది బలయితే, ఆ శిధిలాలపై కొత్త రాష్ట్రాన్ని, సమాజాన్ని నిర్మించడానికి నడుముకట్టిన కమ్యూనిస్టులకు సామ్యవాద సమాజానికి దారితీసే ఆ తోవపై దశాబ్ధాల ప్రయాణం ముందున్నదన్న విషయంపై ఆనాడే స్పష్టత ఉంది.’ఇకపై చైనా ప్రపంచంలో శాంతి, స్వేచ్ఛలని కోరుకునే ప్రపంచ దేశాలన్నిటికీ చెందుతుంది’ అని 1949, సెప్టెంబర్ 21న జరిగిన చైనా ప్రజా రాజకీయ సంప్రదింపుల సభ (చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్) మొదటి ప్లీనరీ సమావేశంలో మావో ఎలుగెత్తి చాటాడు.
ఒడిదుడుకులకు తలొగ్గక, శాయశక్తులా తమ నాగరికత అభివృద్ధికి, ప్రజాశ్రేయస్సు పెంపునకు పాటు పడుతూనే; నూతన చైనా ప్రపంచశాంతి, స్వేచ్చలకి దన్నునిస్తుందని ప్రకటించాడు. ‘మనం సగర్వంగా నిలబడ్డాం! ఇకపై అవమానాలు, తలవంపుల కింద మన దేశం నలగబోదు’ అని ఉద్ఘాటించాడు. ఆ సభలో మావో అన్నమాటలు, ఆనాడు ప్రపంచమంతటా జరుగుతున్న సామ్రాజ్య వాద వ్యతిరేక ఉద్యమాల ఆశయాలకు ప్రతిబింబం. భారతదేశంలో నెహ్రూ కాని, ఈజిప్టులో గమాల్ అబ్దుల్ నాస్సర్ కాని, ఆనాటి వలసపాలన వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరి గొంతుల్లో, ఇవే భావాలు పలికేవి. వలసపాలన అవశేషాలు మిగలకుండా ముగియడానికి ప్రపంచశాంతి, సమతలు ఎంతైనా అవసరం.
శాంతి, సమతల నీడనే, ఉక్కుపాదం కిందనుండి బయటపడిన ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడగల సమాజాల్ని నిర్మించుకోగలరు. 2024లో, ఆనాడు మావో ఇచ్చిన సందేశం నెమరువేసుకుంటూ, మనచుట్టూ చూస్తే -వలసపాలన నుండి స్వాతంత్య్రం సాధించిన దేశాలు ఎన్ని ముందడుగులు వేశాయో, అదే సమయంలో, ఎంత మొండిగా అవే వలసవాద, సామ్రాజ్యవాద శక్తులు ఇప్పటికీ ఈ దేశాల ప్రగతిని అడ్డగిస్తున్నాయో కనిపిస్తుంది.ఈ రోజు పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణ కాండ, ఇజ్రాయిల్ చేతిలో భీకరమైన బాంబు దాడులకి గురవుతున్న లెబనాన్ – మనల్ని, తునకలు చేసి బయటికి రావాలనుకున్న వలస వాద గతంలోనే కట్టి ఉంచు తున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు మనపై రద్దుతున్న యుద్ధాలు, మావో వక్కాణించిన ‘నాగరికతల అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు’, ‘ప్రపంచ శాంతి, స్వేచ్ఛ’ లకు అడ్డంకులు. వలసవాదం కింద నలిగిన బయటపడిన దేశాల ముందు రెండు దారులున్నాయి.
ఒకరినొకరు ప్రత్యర్ధులుగా చూస్తూ, మన సంపద, శక్తులని వినాశకర యుద్ధాలకి తగలపెట్టడమా, లేక మావో అన్నట్లు స్వేచ్ఛాప్రియ దేశాలతో అంతర్జాతీయ శాంతికాముక సమాజాన్ని నిర్మించడమా! సామ్రాజ్యవాద దేశాల కంపెనీలకు అతి చౌక ధరల్లో ముడి వస్తువులు సరఫరా చేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్న మూడవ ప్రపంచ దేశాలు, తమ శ్రామికుల వేతనాలు తొక్కిపెడితే – వారి శ్రమని దోచి బహుళ జాతి కంపెనీలు భారీ ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రపంచ కార్మికులని దోచి కూడగట్టిన ఈ లాభాలని కొత్త టెక్నాలజీల అభి వృద్ధిపై వెచ్చించి, తమదేశాల ఉత్పత్తి శక్తుల్ని బలపరచుకుంటూ, టెక్నాలజీ పోటీలో ముందుంటూ, ఆధిపత్యం చెలాయిస్తున్న వీటి గుప్పిటనుండి మూడో ప్రపంచ దేశాలు బయటపడి, స్వయం ప్రతిపత్తి పెంచుకోవడం ఎలా? చాలీచాలని వేతనాలు, కొనుగోలు శక్తి లేని ఆర్ధిక వ్యవస్థలో చిక్కుకున్న ఈ దేశాలు, అభివృద్ధికి అవసరమైన వనరులు ఎలా సమకూర్చుకుంటాయి?
ఈ సమస్యని అధిగమించడానికి చైనాతో సహా, కొన్ని దక్షిణాది దేశాలు తమ తమ మార్గాలు ఎంచుకున్నాయి. ఈ విషయంలో చైనా అనుభవం చర్చించ దగ్గది. విప్లవం తరువాత చైనా తన దగ్గర ఉన్న కొద్దిపాటి వనరులు నేర్పుగా కూడగట్టుకుని, సోషలిస్ట్ రష్యా సహాయంతో పాత భూస్వామ్య వ్యవస్థను పెకిలించి, కొత్త వ్యవసాయిక వ్యవస్థకి పునాదులు వేసి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విద్య, వైద్య వ్యవస్థలని దేశవ్యాప్తంగా నిర్మించి జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచింది. 1949, 1978 మధ్య సమయం చైనా అభివృద్ధి మొదటి దశ. ఈ కాలంలో చైనాలో ఏర్పడిన సమానత్వంవల్ల , విద్యావంతులై, ఆరోగ్యంతో ఉన్న జనాభా నిష్పత్తి తక్కిన మూడో ప్రపంచ దేశాల కన్నా చాలా ఎక్కువగా ఉండేది.
రెండవ దశలో 1979 నుండి, విద్య, నైపుణ్యం, ఆరోగ్యాలలో ముందున్న ఈ శ్రామికవర్గం ఆధారంగా చేసుకుని ప్రభుత్వం బహుళ జాతి కంపెనీల పెట్టుబడులని ఆకర్షించింది. ప్రణాళికాబద్ధంగా, సాంకేతిక పరిజ్ఞానం స్థానిక కంపెనీల చేతిలోకి మారేట్లుగా, చైనాలోకి పెట్టుబడి తెచ్చిన విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశ కరెన్సీ వినమయ ధరని మార్కెట్ శక్తులకి వదిలేయకుండా, ప్రభుత్వం అదుపు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను ఈ నూతన సాంకేతిక అభివృద్ధిలో భాగంగా చేసింది. ఉదారవాద అంత ర్జాతీయ వ్యవస్థ పరిధిలో ఉంటూనే, సాంకేతిక పరిజ్ఞానం కోసం సామ్రాజ్యవాద దేశాలపై ఆధారపడే అవసరాన్ని అధిగమించి చైనా సాధించిన గణనీయమైన ఆర్ధిక, సాంకేతిక అభివృద్ధులకు కారణం పైన తెలిపిన ప్రణాళికలు.



