
దొంగతనం నేపంతో ఇద్దరు బాలికలకు చిత్రహింసలు
వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
వరంగల్ జిల్లా:ఆగస్టు 16: ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు బాలికలను చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో దొంగతనం నెపంతో ఇద్దరు 12 ఏళ్ల బాలికలను గ్రామంలోని బొడ్రాయి వద్ద చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా కళ్లల్లో కారం కొట్టి మామిడి కాయ పచ్చడ కళ్లల్లో రుద్ది నానా హింస పెట్టారు. ఇద్దరు ఇతర కులానికి చెందిన వారు బాలికల తల్లిదండ్రులను సైతం ఇబ్బందులకు గురి చేశారు.
చెన్నూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 15 రోజుల క్రితం రూ.1.35 లక్షలు నగదును ఎవరో ఎత్తుకెళ్లారు. అయితే వారింటికి ఆయన సోదరుడి కూతురుతో పాటు మరో ఇద్దరు అమ్మాయి తరుచుగా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆ డబ్బులను వీరే తీశారని అనుమానంతో ఇంటి యజమాని దారుణంగా కొట్టాడు. ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించడంతో వారు మౌనంగా ఉండిపోయారు. ఆ విషయం ఆ నోటా ఈనోటా మంగళవారం బయటపడింది. కాగా, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందిందని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు…



