అదిలాబాద్, అక్టోబరు 17, (వాయిస్ టుడే): బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ బాపురావు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. రాథోడ్ బాపురావుకు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అక్టోబరు 18న కాంగ్రెస్ లో చేరిన బాపురావు హస్తం పార్టీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బోథ్ ఎమ్మెల్యే బాపురావు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నాయకత్వం పక్కనబెట్టి అనిల్ జాదవ్‌కు సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, రేఖా నాయక్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఏడు స్థానాల్లో మార్పులు చేశారు. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుభాష్‌రెడ్డి (ఉప్పల్), రాజయ్య (స్టేషన్ ఘన్పూర్), రాములు నాయక్ (వైరా), రేఖానాయక్ (ఖానాపూర్), చెన్నమనేని రమేష్ (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి), రాథోడ్ బాపురావు (బోత్), విద్యాసాగర్‌రావు టిక్కెట్లు ఇవ్వలేదు.కాంగ్రెస్ తొలి జాబితాలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ వంటి మాజీ బీఆర్ఎస్ నేతలకు టిక్కెట్లు ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. దసరా తర్వాత పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.

నారాయణరావు గుడ్ బై
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. రాహుల్, ప్రియాంక సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయన ముధోల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి 8 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దొరకలేదు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు టికెట్ నిరాకరించారు. దీంతో వీళ్లలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే కాదు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పార్టీని వీడుతున్నారు. స్థానికంగా నల్గొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్‌తోపాటు మరికొందరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగపల్లి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తన భార్యతోకలిసి కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ సమక్షంలో ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు.

ఆకుల లలిత రాజీనామా సీఎంకు లెటర్
నిజామాబాద్ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత జిల్లా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార సంఘం చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పరిపాలన సాగిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాలు తనను ఇబ్బంది పెడుతుండడంతో బీఆర్ఎస్ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల లలిత ఎన్నికల అనంతరం బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీని వీడి సొంత ఇంట్లో చేరుతారన్న వర్గాలు తాజాగా ఊపందుకున్నాయి. అక్టోబర్ 20 నుంచి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ పర్యటన నేపథ్యంలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.2008 ఉప ఎన్నికల్లో ఆకుల లలిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2015 తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆకుల లలిత ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2021, డిసెంబర్ 24న తెలంగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత బాధ్యతలు స్వీకరించారు. అయితే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై అసంతృప్తితో ఉన్న ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.



