రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి. ఆనంద్
DGP C.V. Anand handed over an insurance cheque of ₹1 crore to the family of the constable who died in a road accident.
హైదరాబాద్, ఆగస్టు 3 (వాయిస్ టుడే):
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర పోలీసు శాఖ తరఫున రూ.1 కోటి బీమా చెక్కును డీజీపీ సి.వి. ఆనంద్ అందజేశారు.
మల్కాజిగిరి కమిషనరేట్ 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22-23 అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు, తలకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత స్థానికంగా ప్రథమ చికిత్స అందించి, అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు.
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ చరణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు.




