వరంగల్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. మూడు స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టింది. అందులో పరకాల, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలుండగా.. ఆయా సెగ్మెంట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా ఎవరిని ప్రకటిస్తారోననే చర్చ సాగుతోంది.బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రకాశ్ జావడేకర్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ దాదాపు మూడు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసింది. అనంతరం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదంతో 52 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. అందులో తొమ్మిది మంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఇందులో జనరల్ స్థానాలైన వరంగల్ ఈస్ట్ టికెట్ ను ఎర్రబెల్లి ప్రదీప్రావు, వరంగల్ వెస్ట్ రావు పద్మ, జనగామ ఆరుట్ల దశమంత్ రెడ్డి, భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి, పాలకుర్తి లేగా రాంమోహన్ రెడ్డి, ఎస్సీ రిజర్వ్ అయిన స్టేషన్ ఘన్పూర్ డాక్టర్ గుండె విజయరామారావు, వర్ధన్నపేట కొండేటి శ్రీధర్, ఎస్టీ రిజర్వ్ అయిన మహబూబాబాద్ జాటోత్ హుస్సేన్ నాయక్, డోర్నకల్ భూక్య సంగీతకు కేటాయించారు. దీంతో టికెట్లు దక్కిన అభ్యర్థులు సంతోషంతో సంబరాలు చేసుకోగా.. టికెట్ ఆశలు పెట్టుకున్న మిగతా వాళ్లంతా నిరాశలో పడ్డారు.

నర్సంపేట సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేసింది. కానీ అనూహ్యంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరి బీజేపీ భారీ షాక్ ఇచ్చారు. పరకాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదివరకు ఇదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన యువ నేత గోగుల రాణాప్రతాప్ ను వివిధ కారణాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.దీంతో ప్రత్యామ్నాయంగా నర్సంపేట నియోజకవర్గంలో పోటీలో నిలిచే నాయకులు లేకుండా పోయారు. కాగా వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యూత్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఏనుగుల రాకేశ్ రెడ్డిని నర్సంపేట నుంచి బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఆయన నిరాకరించగా.. నెక్కొండ మండలానికి చెందిన ఓ మాజీ ఎంపీపీ పేరు పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.పరకాల నియోజకవర్గ టికెట్ ను ప్రజల డాక్టర్ గా పేరున్న డా.కాళీ ప్రసాద్, రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్న డా.పెసరు విజయచందర్ రెడ్డి ఆశిస్తున్నారు. వైద్య సేవలందిస్తూ జనాల్లో మంచిపేరు సంపాదించడం, యూత్ లోనూ మంచి పట్టు ఉండటంతో టికెట్ డాక్టర్ కాళీ ప్రసాద్ కేనని అంతా భావించారు. అందులోనూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సన్నిహితుడిగా పేరున్న కాళీప్రసాద్ టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. కానీ ఫస్ట్ లిస్ట్ లో పేరు లేకపోవడంతో ఆయనా గందరగోళంలో పడ్డారు.ఇదిలాఉంటే బీసీ కోటాలో టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ములుగు సెగ్మెంట్ ను కూడా బీజేపీ పెండింగ్ లో పెట్టగా.. ఇక్కడ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు బంజారా సామాజిక వర్గానికి చెందిన భూక్యా జవహర్ లాల్ కూడా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాగా టికెట్ల కేటాయింపులో ఆచితూచీ వ్యవహరిస్తున్న బీజేపీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి.



