నిజామాబాద్, అక్టోబరు 30, (వాయిస్ టుడే ): బోధన్ లో ఆసక్తికర రాజకీయం అధికార, ప్రతిపక్ష పార్టీ అని సంబంధం లేకుండా నిజామాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు రెబల్స్ బెడద నెలకొంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ అవకాశం కల్పించినప్పటికీ… మరొకరు పోటీకి సిద్ధమయ్యారు. ఆ నియోజకవర్గమే బోధన్. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,15,963 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,03,577 మంది పురుషులు ఉండగా.. 1,12,381 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యే షకీల్ అమేర్ రెండు సార్లు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించారు.కానీ ఈ ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు విపక్షాలకు సైతం ఈ నియోజకవర్గం తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రతి పార్టీ నుంచి ఇద్దరు చొప్పున పోటీకి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమేర్‌కు మరోసారి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. కానీ ఆయనకు స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఛైర్మన్‌కు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న ఘర్షణతో ఛైర్మన్ పి పద్మావతితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్ గంగాధర్ పట్వారీ సైతం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి రెబల్‌గా అమర్‌నాథ్‌బాబు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూసినప్పటికీ.. తగిన అవకాశం రావడం లేదని, కార్యకర్తలకు సైతం తాను న్యాయం చేయలేకపోతున్నానని వాపోయారు. కార్యకర్తల సమావేశం నిర్వహించి అందులో వచ్చిన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అయితే మొదటి నుంచి బోధన్ నియోజకవర్గంలో షకీల్ అమేర్ పోటీపై స్పష్టత కరువయ్యింది. మొదట ఆయన సతీమణి అయేషా ఫాతిమా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తరువాత స్థానిక నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఎమ్మెల్సీ కవితనే పోటీ చేస్తారని టాక్ నడిచింది. కానీ చివరకు మళ్లీ షకీల్ అమేర్‌కు అధిష్టానం అవకాశం కల్పించింది.బీజేపీ నుంచి సైతం బోధన్ లో ఇద్దరు పోటీకి సిద్ధంగా ఉన్నారు. టిక్కెట్టు నాకంటే నాకంటూ పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మోహన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మేడిపాటి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. ఇద్దరు పోటీకి సిద్ధమయ్యారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో భాగస్వామ్యం ఉన్న మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ తీరుతో విసుగు చెంది ఎంపీ అరవింద్ పిలుపు మేరకు పార్టీలో చేరారు. ఆ సమయంలోనే పార్టీ టిక్కెట్టుపై హామీ లభించినట్టు నియోజకవర్గంలో ప్రచారం ఉంది. కాగా మేడిపాటి సైతం బోధన్‌లో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ఈసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు. గడిచిన రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి సైతం రెడీగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే పోటీ చేయాలని భావించినప్పటికీ… సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వెనక్కి తగ్గినట్టు ఆయన అనుచరుల టాక్. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని కరుణాకర్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. సుదర్శన్‌రెడ్డి సైతం మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అందులో భాగంగా బీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త, సీనియర్ నాయకులను కలిసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.