హైదరాబాద్, నవంబర్ 9, (వాయిస్ టుడే): బీఆర్ఎస్ పార్టీ గతం కంటే ఈసారి సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎక్కువమంది ఆకర్షితులు అయ్యే అవకాశం ఉన్నందున పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని అందులో పోస్ట్ చేసే ప్రక్రియను స్పీడప్ చేసింది. ప్రభుత్వ సక్సెస్ స్టోరీలను ప్రచారంలోకి తేవాలని, సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేయాలని మంత్రి కేటీఆర్ పార్టీ ఐటీసెల్‌కు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై, ముఖ్యంగా దళితబంధు, రైతుబంధు, ప్రైడ్, కల్యాణలక్ష్మి, బీసీమైనార్టీలకు లక్షసాయం, రైతుబీమా, 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటివి లబ్దిదారులతో కేస్ స్టడీ వారీగా సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఎవరు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, ట్విట్టర్ ఇలా దేనిని ఓపెన్ చేసినా తెలంగాణ సంక్షేమ పథకాలే ప్రత్యక్షం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలను మేనిఫెస్టోను సైతం వివరించే ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం లీజుకు తీసుకోవడం, కొన్నింటిని నడిపిస్తూ సంక్షేమ పథకాలను విస్తృత ప్రచారం చేయడం చేస్తున్నారు. కేటీఆర్ నిత్యం పర్యవేక్షణ చేయడంతో పాటు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఎలా ఇవ్వాలలో నిర్వాహకులకు ఆదేశాలు ఇస్తున్నారు. గతంకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.దళితబంధు, రైతుబంధు, టీఫ్రైడ్, కళ్యాణలక్ష్మి, బీసీ, మైనార్టీలకు లక్షసాయం వంటి సంక్షేమ పథకాలను కేస్ స్టడీలతో ట్రెండింగ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కేస్ స్టడీలతో, పూర్తి వివరాలతో పోస్టు చేసి ట్రెండింగ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. ఇప్పటికే స్టార్ట్ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు రాలేదని మరింత వేగం పెంచాలని భావిస్తున్నది. మిగిలిన పార్టీలు విమర్శలు పెంచినప్పటికీ వాటిని తిప్పికొట్టడంలోనూ కొంత వెనుకబడుతున్నామని ఐటీ సెల్‌ను మందలించినట్లు సమాచారం. గ్రామాలవారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లోనూ అభివృద్ధిని పోస్టుచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, తాగునీటి పైపులైన్లు, ఇతరత్రా చేపట్టిన పనులను ఎంత వ్యయంతో చేశారనే వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల పరిస్థితిని సైతం వివరించే ప్లాన్ చేస్తున్నారు.