విజయవాడ, నవంబర్ 23, (వాయిస్ టుడే): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత చంద్రబాబు జైలుకి వెళ్లడంతో టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటీవల చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో హైకోర్టు ఈనెల 28 వరకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈనెల 20వ తేదీన చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్‌తో జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు. అయితే, కోర్టు విధించిన షరతులకు లోబడి ఆయన రాజకీయంగా కూడా కొన్ని అంతర్గత సమావేశాలు నిర్వహించుకున్నారు. మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చంద్రబాబు సమావేశమై భవిష్యత్ వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ తో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. నవంబర్ 29 వ తేదీ నుంచి చంద్రబాబు ర్యాలీలు, రాజకీయ పరమైన సమావేశాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వులతో చంద్రబాబు రాక కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి ఎప్పుడు వస్తారు..? ప్రజల్లోకి ఎప్పటి నుంచి వస్తారనే విషయాలపై పార్టీ కేడర్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ ముఖ్య నేతల సమాచారం ప్రకారం ఈనెల 29 నుంచి చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది. త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి వెళ్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.హైకోర్టు ఆదేశాలతో చంద్రబాబు రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి రూట్ క్లియర్ అయింది. ర్యాలీలు, బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు పాల్గొనే చాన్స్ ఉంది. దీంతో చంద్రబాబు రీ ఎంట్రీ కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే జనసేన పార్టీతో పొత్తు కుదిరింది. పొత్తుల ప్రకటన తర్వాత రెండు పార్టీలను లోకేష్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారు ముందుకు నడిపిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నాయి.. ఇక చంద్రబాబు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 29 న చంద్రబాబు ప్రజల ముందుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలనే ఆలోచనతో పార్టీ వర్గాలున్నాయి. గతంలో నిలిచిపోయిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అయితే జనసేన కూడా టీడీపీతో కలవడంతో ఈ కార్యక్రమం పేరు మార్పు చేసి ప్రజల్లోకి వెళ్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బాబు అరెస్ట్ అయిన నంద్యాల నుంచే ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం.చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. అరెస్ట్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారే తప్ప భారీ బహిరంగ సభలు నిర్వహించలేదు.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల వేగం పెంచేలా ముందుకు వెళ్లాలని.. అధినేత యోచిస్తున్నట్లు సమాచారం.. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా అర్ధాంతరంగా నిలిచిపోయింది.. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా తిరిగి జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది.ఈనెల 24 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఇది కాస్తా 27కు వాయిదా పడినట్లు తెలిసింది.. పాదయాత్ర మధ్యలో నిలిచిపోయిన కోనసీమ జిల్లా రాజోలు నుంచి తిరిగి ప్రారంభించేలా లోకేష్ రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. సుమారు రెండు నెలలకు పైగా తెలుగుదేశం పార్టీలో మళ్లీ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఇలా చంద్రబాబు, లోకేష్ పర్యటనలు చేస్తూనే.. పవన్ కళ్యాణ్ తో కలిసి కూడా ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.