రాష్ట్ర వైఎస్ఆర్సిపి మహిళ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత
మహిళల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా టిడిపి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి తారక రామారావు కుమారుడు సినీహీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దుష్ట సంస్కృతి, దుర్మార్గపు ప్రవర్తనను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో టిడిపి పార్టీకి, బాలకృష్ణకు పుట్టగతులు లేకుండా పోతాయని రాష్ట్ర వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు, పోతుల సునీత ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళల పట్ల ప్రవర్తించిన తీరును ఎండగట్టారు.
ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ… భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశంగా వెలసిల్లుతున్న దేశం అన్నారు. మహిళలకు గౌరవాన్ని ఇచ్చే సంస్కృతి మనదని, మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో, గౌరవింపబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్న నానుడి ఉందన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా… మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వావలంభన దిశగా అడుగులు వేసి మహిళలకు 50 శాతం పైగా పదవులను, అధికారాలను అందించారని అన్నారు. అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీలోని నాయకులు, మంత్రులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులకు గురి చేసిన సంఘటన ప్రజలు మరచి పోరన్నారు. అదేవిధంగా విజయవాడ కేంద్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మహిళలను వేధింపులకు గురిచేసి వారిని బజారుకీర్చారన్నారు. టిడిపి పార్టీ దుష్ట చరిత్ర ఉన్న పార్టీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. గతంలో టిడిపి పార్టీ నాయకుల జయప్రద, రోజా, దివ్యవాణి తదితర మహిళ నాయకులను వేధించి అనేక ఇబ్బందులకు గురిచేసి వారిని కంట తడి పెట్టించినారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విధంగా సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన టిడిపి పార్టీ తీరును ప్రజలు గ్రహించి 2019 ఎన్నికలలో పుట్టగతులు లేకుండా చేశారని అన్నారు. చంద్రబాబు వియ్యంకుడు ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళల పట్ల ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు అన్నారు. బాలకృష్ణ కండకావరంతో పెత్తందారీ దురాలోచనలతో ప్రవర్తించిన తీరు దుర్మార్గమని సిగ్గుచేటని, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాలకృష్ణ ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆయన ప్రవర్తించిన తీరు మహిళా లోకం తలదించుకునేలా ఉందని అన్నారు. మహిళలు కనిపిస్తే కడుపైనా చేయాలి.. ముద్దైనా పెట్టాలి.. అన్న బాలకృష్ణ మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న బాలకృష్ణ పట్ల మహిళలు జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే భలేవాడివి బాసు చిత్రంలో తమిళ హీరోయిన్ పై బాలకృష్ణ వ్యవహరించిన తీరు నీచాతి నీచంగా ఉందని, కూతురు వయసు ఉన్న హీరోయిన్ ను లైంగిక వేధింపులకు గురిచేసిన దుర్మార్గపు ఆలోచనలు కలిగిన బాలకృష్ణ కు మహిళలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బిగ్ బాస్ షోలో తమిళ హీరోయిన్ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బాలకృష్ణ ప్రవర్తించిన తీరు గురించి మీడియా ముందు చెప్పడం ఎంతో బాధాకరమన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు ఓ చరిత్ర సృష్టించిన రాజకీయ నాయకునిగా, సినీ హీరోగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని, ఆయన కొడుకుగా బాలకృష్ణ మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అయనకు కనీసం సిగ్గు ఎగ్గు లేదని , తండ్రి పరువును మట్టిలో కలిపేస్తున్నాడని అన్నారు. బాలకృష్ణ తన పద్ధతి మార్చుకోకపోతే రానున్న 2024 ఎన్నికల్లో మహిళల శాపాలు టిడిపి పార్టీకి తగలడం ఖాయమన్నారు. వారు చెప్పేవన్నీ శ్రీరంగనీతులని చేసేవి పాడు పనులన్నారు. విగ్గులు పెట్టుకొని పెగ్గులు చేత పట్టుకొని అసహ్యంగా ప్రవర్తిస్తే ప్రజలు బాలకృష్ణ ను నాయకుడిగా ఎలా గుర్తిస్తారన్నారు. బాలకృష్ణ ఈ దుష్ట, నీచ, దుర్మార్గపు సంస్కృతిని మానుకోవాలని, ఇకనైనా ముగింపు పలకాలని, లేకపోతే మహిళలు తిరగబడతారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి పార్టీ మహిళ అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి , నంద్యాల వైఎస్ఆర్సిపి మహిళా విభాగము సభ్యులు పాల్గొన్నారు.



