హైదరాబాద్, నవంబర్ 27, (వాయిస్ టుడే): 60 ఏళ్లను ప్రత్యేక తెలంగాణ కలను తమ పోరాట పటిమతో సుసాధ్యం చేసింది బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ. ఉద్యమ నేత కేసీఆర్ వ్యూహ ప్రతివ్యూహాలు, తెలంగాణ ప్రజల సమిష్టి పోరాటాల ఫలితంగా తలొగ్గిన కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాట చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించింది. అదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్న స్థాయికి తీసుకెళ్లారు. ఫలితంగానే.. 2014లో సంపూర్ణ మెజార్టీతో తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. ఆ తరువాత జరిగిన వరుస ఉప ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసింది. ఇక 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన సత్తా చాటింది. మునుపటి ఎన్నికల్లో 66 చోట్ల గెలిస్తే.. ఈ ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాలు గెలిచింది. అయితే, ప్రతి ఎన్నికల్లో విజయదుందుభి మోగించి తెలంగాణలో గులాబీ జెండాను బలంగా పాతిన టీఆర్ఎస్.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కనీసం ఖాతా తెరవలేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు గెలిచిన దాఖలాలు లేవు. అయితే, ఆ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు తరువాత బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చేరినా.. తదుపరి ఎన్నికల్లో ఓటమే ఎదురైంది. దాంతో.. ఈ 17 స్థానాలు ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచాయి. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టని ఆ 17 నియోజకవర్గాలేంటో ఓసారి చూద్దాం.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాతమ్రే. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. వాటిలో నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేట, బహదూర్ పురా, యాకర్ పురా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలుపొందలేదు. ఇక మహేశ్వరం, ఎల్బీనగర్ పరిస్థితి కూడా అంతే. మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి టీడీపీ తరఫున గెలుపొందారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి గెలిచారు. ఆ తరువాత ఆమె బీఆర్ఎస్లో చేరారు. ఇక ఎల్బీనగర్లో 2014లో టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య గెలిచారు. 2018లో కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు. ఈయన ఆ తరువాత బీఆర్ఎస్లో చేరారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాచలం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత అంటే 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటే చోట గెలిచింది. జలగం వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పార్టీ జెండాను ఎగురవేశారు. మిగతా 9 స్థానాల్లోనూ ప్రత్యర్థులే విజయం సాధించారు. వైసీపీ నుంచి గెలిచిన మదన్ లాల్(వైరా), పాయం వెంకటేశ్వర్లు(పినపాక), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారావుపేట), ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ అజయ్(ఖమ్మం), కోరం కనకయ్య(ఇల్లందు) సైతం బీఆర్ఎస్లో చేరారు. ఇక పాలేరు నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి హఠాన్మరణంతో.. ఉప ఎన్నిక జరుగగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు.ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవని ఈ 17 స్థానాల్లో ఈ ఎన్నికల్లోనైనా గెలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి ఖాతా తెరవని ఈ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచి.. రికార్డ్లను బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.