చంద్రబాబు, పవన్ చర్చలు
విజయవాడ, మార్చి 6
తెలుగుదేశం అధినే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుమారు గంటన్నర పాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. బీజేపీ పొత్తు, మొదటి లిస్ట్ ప్రకటించిన తర్వాత వెల్లువెత్తిన అసంతృప్తుల వ్యవహారం, ప్రకటించాల్సిన స్థానాలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడుకున్నారు. ఎక్కువ భాగం భారతీయ జనతా పార్టీతో పొత్తు వ్యవహారం గురించి డిస్కషన్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో నోటిఫికేషన్ రానుందని వార్తలు వస్తున్న టైంలో ఏపీలో పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాయి. ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఓ సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చర్చలు కూడా జరిపారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి పురగతి లేదు. ఈ పొత్తు కోసమే టీడీపీ జనసేన ఎంపీ స్థానాలు ఖరారు చేయలేదు. సమయం ముంచుకొస్తున్న టైంలో ఢిల్లీ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. పొత్తు వ్యవహారం ఓ వైపు కీలకంగా ఉంటే… మరో వైపు అభ్యర్థుల జాబితాపై కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. టీడీపీ ఇప్పటికే 94 మంది అభ్యర్థులనుప్రకటించింది. జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా టజనసేనకు 24 సీట్లు కేటాయించారు. ఇందులో ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా 19 మంది పేర్లు వెల్లడించాల్సి ఉంది. టీడీపీ ఇంకా ఎంత మంది జాబితా విడుదల చేయాలో తేలాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకమైన జాబితా లేకుండా మరో జాబితా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు ఇరువురు ఢిల్లీ వెళ్లబోతున్నారని కూడా టాక్ నడుస్తోంది. దీనిపై కసరత్తు చేస్తున్నారు ఇరుపార్టీల అధినేతలు. ప్రకటించాల్సిన నియోజకవర్గాల్లో ఆశావాహులు, సర్వేల్లో ముందంజలో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించేయాలన్న ఆలోచనలో టీడీపీ, జనసేన ఉంది. ఆ దిశగానే కసరత్తు జరగుతోంది.