పట్టణ పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగుపర్చాలి.
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
-ప్రతి రోజూ ఉదయం శానీటేషన్ సూపర్వైజర్ ఫీల్డ్ విజిట్ నిర్వహించాలి
-డ్రైయినేజీలను రెగ్యులర్ గా క్లీన్ చేయాలి
-మంథని పట్టణంలో పారిశుధ్యం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
మంథని
మంథని పట్టణంలో పారిశుధ్య నిర్వహణ గణనీయంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పురపాలక కార్యాలయంలో పట్టణ పారిశుధ్య నిర్వహణపై వార్డు అధికారులు, శానిటేషన్ సూపర్ వైజర్ లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మంథని పట్టణంలోని 13 వార్డులలో ఆశించిన స్థాయిలో పారిశుధ్య నిర్వహణ లేదని, రోడ్లపై చెత్త, డ్రైయినేజి లీకేజిలు స్పష్టంగా తెలుస్తున్నాయని అన్నారు. రోడ్లపై నీటి నిల్వలు అధికంగా ఉన్నాయని, దోమల నివారణ చర్యలు కూడా ఆశించిన స్థాయిలో జరగడంలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
15 రోజుల వ్యవధిలో పట్టణ పారిశుద్ధ్యంలో గణనీయమైన మార్పులు రావాలని, ఇకపై ప్రతి రోజూ ఉదయం వార్డ్ అధికారులు, శానిటేషన్ సూపర్ వైజర్ లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలని, ప్రతి రోజూ రోడ్లను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని, డ్రైనేజీలను క్లీన్ చేయాలని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మంథని పట్టణంలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేలా చూడాలని, రోడ్డుపై ఎక్కడ ప్లాస్టిక్ చెత్త కనిపించవద్దని, డ్రైనేజీ నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ శుభ్రం చేయాలని, పట్టణంలో ఉన్న పిచ్చి మొక్కలను పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ అంశంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలకు వెనుకాడబోమని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తో పాటు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



