షాద్ నగర్ లో మెడికల్ మాఫియా..!
Medical mafia in Shad Nagar..!
*ప్రజల నుండి లక్షల్లో డబ్బు వసూళ్లు ..*
*అధికారుల కనుసన్నల్లోనే వైద్య వ్యాపారం..?*
*అమాయకుల ప్రాణాలతో చెలగాటం*
డబ్బు ఖర్చయినా పర్వాలేదు జబ్బు నయం కావాలనే ఉద్దేశ్యంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే వారు ఎక్కువ.. సరిగ్గా ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని తమ ఆసుపత్రికి వచ్చిన వారి జేబులు గుళ్లచేసి పారేస్తున్నారు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లాలోనీ షాద్ నగర్ పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు రోజు రోజుకు శ్రుతి మించి పోతున్నాయి. సదరు ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా ఉండటం మూలంగానే రాములు కను పోయిందని బాధితులు గగ్గోలు పెడితే ఆసుపత్రి యాజమాన్యం రాములు కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు సమర్పించి తప్పును కప్పి పెట్టారని సమాచారం. ఇక చిన్న రేవల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుని సూచన మేరకు పట్టణంలోని తులసి కంటి ఆసుపత్రిలో చికిత్స కొసం అడ్మిట్ అయ్యాడు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాదితులు పెద్దఎత్తున ఆసుపత్రి ముందు బైఠాయించి వైద్యులపై చర్య తీసుకోవాలని పట్టుబట్టారు. స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చిన పేషెంట్లకు అవసరం లేకపోయినా అన్ని రకాల టెస్టులు రాసి.. వారి వద్ద నుంచి అందినంత గుంజుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Medical mafia in Shad Nagar..!
*అంతా సిండికేట్ వ్యాపారం..*
వైద్య, ఆరోగ్య శాఖ వైఫల్యంతో షాద్ నగర్ పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అంతా సిండికేట్ గా మారి తమ వైద్య వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్న తరుణంలో అధికారుల ప్రేక్షక పాత్ర పేదల పాలిట శాపంగా మారింది. పదేళ్లకు పైగా షాద్ నగర్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యాధికారి ఈ ఆసుపత్రుల ఆగడాలకు అండగా ఉంటూ మెడికల్ మాఫియా ను ప్రోత్సహిస్తున్నడని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఉన్నతాధికారులు ఎవరైన ఆసుపత్రుల తనికీలకు వస్తున్నారంటే సదరు వైద్యాధికారి ముందుగానే ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలకు సమచారం ఇచ్చి అలెర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
*నిబంధనలు గాలికి…*
ప్రైవేటు ఆస్పత్రులు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదనే చెప్పవచ్చు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు ఉండాలి. అలాగే ఆస్పత్రిలో బెడ్లు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫైర్ సేఫ్టీ తదితర విషయాల్లో తప్పనిసరిగా వారు సూచించిన విధంగా ఉండాలి. రోగికి చేసే ఆయా పరీక్షల ఫీజు వివరాల బోర్డులు ప్రదర్శించాలి. కానీ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు ఖాతరు చేయట్లేదు. అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా ఆయా ఆసుపత్రుల ల్యాబ్ లలో అర్హత లేకున్నా టెస్టులు చేయిస్తున్నారు.
Medical mafia in Shad Nagar..!
*రిఫరెన్స్ బిజినెస్..!*
ప్రైవేట్ ఆసుపత్రులు వారు పబ్లిసిటీ కోసం మీడియా, పత్రికల్లో అడ్వర్ర్టైజ్ మెంట్ లు వేసుకుంటారు. షాద్ నగర్ పట్టణంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపి లకు ప్రతి నెలా విందులు ఏర్పాటు చేసి వారి వద్దకు వచ్చిన రోగులను తమ ఆసుపత్రికి రిపరెన్స్ చెస్తే పేషెంట్ బిల్ లొ సదరరు ఆర్ఎంపి కి కమీషన్ అందిస్తారు. ఇక వారు కమీషన్ కోసం కక్కుర్తిపడి ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పేషెంట్‌ను తమ ఆస్పత్రికి తీసుకువచ్చిన ఆర్‌ఎంపీకి 30 నుంచి 50 శాతం కమీషన్ ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇక అధికారులు చూసీచూడనట్లు ఉన్నందుకు అధిక మొత్తంలో ప్రైవేటు యాజమాన్యాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు భారీగానే నగదు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



