సైబరాబాద్ కొవిడ్ మేనేజ్‌మెంట్‌కు హార్వర్డ్ గుర్తింపు
Harvard recognizes Cyberabad’s COVID management

8 లక్షల మంది ఐటీ ఉద్యోగులను రోజుల్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు తరలించిన మోడల్‌పై కేస్ స్టడీ
సజ్జనార్ నాయకత్వం.. SCSC సమన్వయం.. ప్రభుత్వ, పరిశ్రమలు, వైద్య సంస్థల భాగస్వామ్యం
కోవిడ్ సంక్షోభ నిర్వహణలో సైబరాబాద్ మోడల్‌కు అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్, ఆగస్టు 8: కోవిడ్-19 మహమ్మారి సమయంలో సైబరాబాద్‌లో చేపట్టిన సంక్షోభ నిర్వహణ, వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు చర్యలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో కోవిడ్ సమయంలో అమలు చేసిన విధానంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ (HBP) సంయుక్తంగా కేస్ స్టడీని ప్రచురించాయి.
“Operational Excellence in Crisis: Transforming Business Continuity in Cyberabad IT Corridor” పేరుతో రూపొందించిన ఈ కేస్ స్టడీకి ఐఎస్‌బీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ (ప్రాక్టీస్) ప్రొఫెసర్ విజయ సుందర్ ఎం., హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మాజీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్, దితి జోషి సహ రచయితలుగా ఉన్నారు.
8 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన వెంటనే అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో పోలీస్ శాఖ, ప్రభుత్వం, పరిశ్రమలు, ఆరోగ్య సంస్థలు, ఎస్‌సీఎస్‌సీ సమన్వయంతో చర్యలు చేపట్టాయి. ఫలితంగా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని దాదాపు 8 లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులను కొద్ది రోజుల్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు తరలించగలిగారు.
దీంతో కోవిడ్ ఆంక్షల మధ్య కూడా ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, తయారీ, రిటైల్, టెలికాం తదితర రంగాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలైంది.
ఎస్‌సీఎస్‌సీ కీలక సమన్వయం
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సమన్వయంతో కోవిడ్ రెస్పాన్స్, బిజినెస్ కంటిన్యూటీ వ్యవస్థను రూపొందించారు. ఎస్‌సీఎస్‌సీ మాజీ సెక్రటరీ జనరల్, ప్రస్తుతం వర్చూసాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డాక్టర్ కృష్ణ యెదుల సమన్వయంతో అత్యవసర సిబ్బందికి రాకపోకల అనుమతులు, సీఈఓలతో సమన్వయం, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రచారం, కార్యాలయ భద్రతా చర్యలకు మద్దతు వంటి కార్యక్రమాలు చేపట్టారు.
సేవా కార్యక్రమాల్లోనూ ముందంజ
వ్యాపార కార్యకలాపాల కొనసాగింపుతో పాటు కోవిడ్ సమయంలో భారీ స్థాయిలో మానవతా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో కోవిడ్ కంట్రోల్ రూమ్, ఆక్సిజన్ బ్యాంక్, ఆక్సిజన్ కేర్ సెంటర్, ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లు నిర్వహించారు.
ఆహారం, పీపీఈ కిట్లు, మందులు, వైద్య పరికరాలను పంపిణీ చేయడంతో పాటు పోలీస్, వైద్య సిబ్బంది, వలస కార్మికులు, కోవిడ్ ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించారు. హైటెక్స్‌లో నిర్వహించిన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఒకే రోజు సుమారు 38 వేల మందికి టీకాలు అందించడం ప్రత్యేకంగా నిలిచింది.
కోర్ టీమ్ సభ్యులకు అభినందనలు
కేస్ స్టడీ ప్రచురణ సందర్భంగా శనివారం వి.సి. సజ్జనార్, డాక్టర్ కృష్ణ యెదుల ఎస్‌సీఎస్‌సీ కోర్ కోవిడ్ టీమ్‌తో సమావేశమయ్యారు. మహమ్మారి సమయంలో సైబరాబాద్ పోలీస్, ప్రభుత్వ శాఖలు, ఆరోగ్య సంస్థలు, పరిశ్రమలతో కలిసి పనిచేసిన సభ్యులు, వాలంటీర్ల సేవలను గుర్తించి అభినందించారు.
సంక్షోభ సమయంలో ప్రభుత్వం–పోలీసు–పరిశ్రమ–ఆరోగ్య సంస్థల సమన్వయం, వేగవంతమైన నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మానవతా దృక్పథంతో సైబరాబాద్ రూపొందించిన మోడల్ అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కేస్ స్టడీగా నిలవడం హైదరాబాద్‌కు గర్వకారణంగా మారింది.




