శివ శివా ఇదేం పద్ధతి… ఇదేం సంప్రదాయం…

- Advertisement -

శివ శివా ఇదేం పద్ధతి… ఇదేం సంప్రదాయం…

Shiva Shiva this is the method... this is the tradition...

శ్రీకాళహస్తి అక్టోబర్ 14
వివాదాస్పద నిర్ణయాలతో ఆదాయానికి గండి… స్థానికులపై ఎందుకీ నిబంధనలు… అవినీతిని పట్టించుకోని అధికారులు… ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఎవరు అధికారులుగా వచ్చినా అసంబద్ధ… వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొందరు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తే మరికొందరు అన్నీ తామే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయంలో అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతాయని… గత వాసనలు ఉండవని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా సంప్రదాయం పేరుతో వివాదాస్పద నిర్ణయాలు… సంస్కరణల పేరుతో నిబంధనలు అమలు చేయడంలో అధికారులు విజయం సాధిస్తున్నారు. సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన ఎప్పటినుంచో ఉంది. అదేవిధంగా భక్తులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి రావాలనే నిబంధన పెట్టడం కూడా సబబే. అయితే అమలుకు కొంత సమయం ఇవ్వాలి. అనుకున్నదే తడవుగా అమలు చేయడం ఎంతవరకు సమంజసమో అధికారులు ఆలోచించాలి. ప్రతి ఏటా రాహు కేతు పూజల వల్ల 70 శాతానికి పైగా ఆదాయం ఆలయానికి వస్తున్నది. ఈ పూజలకు సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే అనుమతిస్తే ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. అంతేగాకుండా చెడు  ప్రచారం జరిగే ప్రమాదం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి రాహు కేతు పూజలు చేయించుకుంటూ ఉంటారు. వారికి ముందుగా సమాచారం తెలియజేయాలి. అందుకు కొంత సమయాన్ని ఇవ్వాలి. ఉరుము ఉరిమినట్లు… మెరుపు మెరిసినట్లు ఆలోచన రావడం… అమలు చేయడం అసలుకే మోసం అనే విషయాన్ని అటు అధికారులు.. ఇటు ప్రభుత్వం గుర్తించాలి. స్థానిక భక్తులు ప్రతి రోజూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని దిన చర్య ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం వేళ మహిళలు కూడా భారీ సంఖ్యలో స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. స్థానికంగా ఉన్న ఆచారాలను కూడా అధికారులు గౌరవించాల్సి ఉంటుంది. నాలుగు గోపురాల నుంచి భక్తులు ఆలయంలోకి వెళుతుంటారు. గోపురాలు వద్ద ఉన్న సిబ్బంది స్థానికులను గుర్తించడం చాలా సులువు. అందరూ పిఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డులు చూపించడం అనేది కష్టమైన పని. పి ఆర్ ఓ కార్యాలయంలో 20 మంది సిబ్బందిని నియమించినా ఆధార్ కార్డులు పరిశీలించి పంపడం అనేది కష్టమవుతుంది. ఆచరణలో అమలు కావడం సాధ్యం కాదు. ఎవరైనా.. ఏ అధికారైనా సాఫీగా జరిగిపోవాలని చూడాలి తప్ప అతిగా… వివాదాస్పదంగా ఉండాలని భావించకూడదు. నిర్ణయం తీసుకునే ముందు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలి. గత ఐదేళ్లు వైసిపి నాయకుల కనుసన్నల్లో ఆలయంలో అనేక అవకతవకలు… అవినీతి… అక్రమాలు… మితిమీరిన జోక్యం… జరగరానివన్నీ జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగింది. అయితే కొందరు నాయకులు కేవలం కొన్నిటిపైనే దృష్టి పెడుతున్నారే తప్ప భక్తుల అవస్థల గురించి పట్టించుకోవడం లేదు. శాసనసభ్యుడు భక్తుల మనోభావాలను పట్టించుకోవాలి. ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, వసూళ్లు అతిథి గృహాలను ఉచితంగా ఉపయోగించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు భక్తులకు నిబంధనలు పెట్టడం.  స్థానికులపై ప్రతాపం చూపించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాల్సిందే అనే విధంగా వ్యవహరిస్తే భంగపాటు తప్పదని కూడా గుర్తించాలి. శివయ్య మూడో కన్ను తెరుస్తాడనే విషయాన్ని మరువకూడదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular