ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన.
Impressive dance performance.జయశంకర్ భూపాలపల్లి,
జిల్లా కేంద్రం భూపాలపల్లి సుభాష్ నగర్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటి హాలులో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కళాకారుల నృత్య, నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ, పెంపు, 53 వేల ఉద్యోగాలు భర్తీ, ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ పథకం అమలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పదకాలపై కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కళాకారులు నాటక, నృత్యాల రూపంలో ప్రదర్శించడం చాలా బావుందని అభినందించారు. రైతులకు, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ఇనమడింపజేసిన కవులు కళాకారుల త్యాగాలను నృత్యాల రూపంలో ప్రదర్శించారని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుల పోరాటాలను జానపదాల ద్వారా వివరించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలిసేలా చక్కటి కళజాత ప్రదర్శనలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కళల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కళా ప్రదర్శనల ద్వారా సామాజిక సందేశాలు ప్రజల హృదయాలకు చేరేలా చేశారని అన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఈ విధమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలలో సృజనాత్మకతను పెంపొందించే దిశగా ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఈ నెల 4వ తేదిన పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేయు కార్యక్రమానికి మన జిల్లా నుండి 101 మంది ఎంపికైనట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కళాకారులు తమ నృత్య, నాటక ప్రదర్శనల ద్వారా రాష్ట్ర ప్రగతిని చూపించారని అన్నారు. ప్రతి ప్రదర్శన చాలా బావుందని, ప్రేక్షకులను ఆకట్టుకున్నదని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి,
స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




