ఖమ్మంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన సన్నాహాలు
ఓటరు నమోదు వేగవంతం చేయాలి: డాక్టర్ గడల శ్రీనివాసరావు
నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి కార్యాచరణకు దిశానిర్దేశం
Jana Sena gears up for Graduate MLC elections in Khammam.
ఖమ్మం, సెప్టెంబర్ 28:
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో జరిగింది.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మిరియాల రామకృష్ణ, బండి నరేష్, మల్లెల సాయి తేజ, తనూజ రెడ్డి, దాసరి రవీష్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా బాధ్యతలు కేటాయించుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పట్టణాలు, మండలాలు, గ్రామాల వారీగా పట్టభద్రులను సంప్రదించడం, ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడం, యువత, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన సూచించారు.
అదేవిధంగా పట్టభద్రుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారి అభిప్రాయాలను సేకరించి, వాటిపై చర్చించే విధంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ నియామకాలు, పట్టభద్ర యువతకు అందాల్సిన అవకాశాలు తదితర అంశాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడంతో పాటు ఓటరు నమోదు నుంచి ఎన్నికల ప్రచారం వరకు దశలవారీ కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల వారీగా మరిన్ని సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధమై, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.




