ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించొద్దు
Don't move Andhra Pragathi Grameen Bank head office to Amaravatiబద్వేలు
ఏ పి జి బి లో మరో మూడు బ్యాంకుల విలీనమైన తర్వాత రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని ‘సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ’ కన్వీనర్ కె.నాగేంద్రబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు.
బద్వేలు సిఐటియు పట్టణ కార్యాలయంలో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. సాంప్రదాయం ప్రకారం చూసినా, ఆర్థిక శాఖ మార్గదర్శకలో తొలి ప్రాధాన్యత ప్రకారం చూసినా ఏ పి జి బి రాష్ట్రస్థాయి ప్రధాన కార్యాలయాన్ని కడపలో కొనసాగించడమే సముచితమని అన్నారు. వ్యాపారం, టెక్నాలజీ, ఆర్బీఐ అనుమతించిన చెస్ట్ సౌకర్యం, సొంతభవనాలు, ప్రజాభవనాలు విలీనం అవుతున్న సప్తగిరి, చైతన్య గోదావరి, ఏపీ వికాస్ గ్రామీణ బ్యాంకుల కంటే మిన్నగా కడపలోని ఏ పి జి బి కే ఉన్నాయని అన్నారు. నూతన రాష్ట్రస్థాయి ఏ పి జి బి పాలసీ, రుణ పరపతి విధానం, చిన్నపరిశ్రమలకు అందించే తోడ్పాటు, వృత్తిదారులకు, వ్యాపార వర్గాలకు అందించే తోడ్పాటు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతాల్లో ఏ పి జి బి ప్రధాన కార్యాలయం ఉంటేనే ఆ ఒరవడి కొనసాగుతుందని అన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తులని కూడా గమనంలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విలీనం తర్వాత ఏర్పడబోయే రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని, అమరావతికి తరలించవద్దని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు యం.చిన్ని, పట్టణ అధ్యక్ష -కార్యదర్శులు యస్.యం.షరీఫ్,యస్.కె.ఆదిల్, సిఐటియు పట్టణ కో-కన్వీనర్ పి.సి.కొండయ్య, భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ నాయకురాళ్లు జి. అనంతమ్మ,యు.బాలమ్మ,యస్. కైరున్ బీ,పి.మోక్షమ్మ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) పట్టణ అధ్యక్ష- కార్యదర్శులు యస్.రాయప్ప,యం. నరసింహులు, చేతివృత్తుదారుల సంఘం పట్టణ నాయకులు సి.సుబ్బారాయుడు,జి. సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు




