ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ….
Prajavani applications should be dealt with expeditiously.అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డిఆర్వో ఎం. రాజేశ్వరి తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు చింతల చెర్వు కోటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం కోసం చెల్లించిన వాటా ధనం మాత్రమే తిరిగి అందించారనీ, ప్రభుత్వ హామీ ప్రకారం పథకాన్ని వంద రోజుల్లో నగదు బదిలీ రూపంలో అమలు చేయాలని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకోగా, సంబంధిత శాఖ ఓ.ఎస్.డి. కి ఉన్నతాధికారులకు దరఖాస్తు పంపాల్సిందిగా అదనపు కలెక్టర్ సూచించారు.
కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన తోటకూరి భద్రమ్మ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 56/1లో 9 ఎకరాల 36 గుంటల భూమి తన భర్త పేరు మీద ఉందని, తన భర్త మరణించినందున సదరు భూమిని తన పేరున బదలాయించా లని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం ఆర్డీవోకు రాస్తూ పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని అన్నారు.
ఏన్కూరు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన వై. లక్ష్మీ తనకు ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్డు అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం నగరం పుట్టకోట ప్రాంతానికి చెందిన ఎస్.కే. సైదా తనకు ప్రమాదంలో ఎడమ కాలు విరిగిందని, తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రకాశ్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ సైదాబీ తాను దివ్యాంగురాలని, తన భర్త చనిపోయారని, తనకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈఈ హౌసింగ్ కి రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, తదితరులు పాల్గొన్నారు.




